చెట్టు పైనుంచి జారిపడి వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

చెట్టు పైనుంచి జారిపడి వ్యక్తి మృతి

Jun 1 2026 12:08 AM | Updated on Jun 1 2026 12:08 AM

కాకినాడ క్రైం: చెట్టు పైనుంచి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. కాకినాడ ద్వారకానగర్‌కు చెందిన కుప్ప పోతురాజు (47) దినసరి కూలి. అతను ఆదివారం ఉదయం రామారావుపేట శివాలయం సమీపంలో ఉన్న కొబ్బరిచెట్టు ఎక్కి కొబ్బరి బొండాలు కొడుతూండగా చెట్టుపై నుంచి కాలు జారి పడిపోయాడు. ఈ ఘటనలో పోతురాజు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. కాకినాడ టూ టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

కట్టుకున్న భర్తే కాలయముడై..

ప్రేమించి పెళ్లి చేసుకున్న

ఆరు నెలలకే ఘటన

అనపర్తి: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను భర్తే అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన బిక్కవోలు మండలం కాపవరం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. అనపర్తి సీఐ వీఎల్‌వీకే సుమంత్‌ కథనం ప్రకారం.. ఒడిశాకు చెందిన సురేంద్ర బగర్‌ భీమవరంలోని రొయ్యల ఫ్యాక్టరీలో పని చేసేవాడు. ఆ సమయంలో సహచరిణి, ఒడిశా రాష్ట్రానికే చెందిన ఉష ఎక్క (26)ను ప్రేమించాడు. పరస్పర అంగీకారంతో గతేడాది డిసెంబర్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం బతుకుదెరువు కోసం సురేంద్ర కాపవరంలోని ఫౌల్ట్రీ కాంప్లెక్స్‌కు వచ్చి అక్కడే గదుల్లో నివాసం ఉంటున్నాడు. ఉష హైదరాబాద్‌లో పనిచేస్తుంది. ఇటీవల ఫౌల్ట్రీలో పనిమానేసి ఒడిశా వెళ్లిన సురేంద్ర, రెండు రోజుల క్రితమే భార్య, తమ్ముడితో కలసి తిరిగి ఫౌల్ట్రీకి వచ్చాడు. అయితే ఉష ఇంట్లో ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడంతో, ఆమె కుటుంబ సభ్యులు తనను చంపేస్తారనే భయంతో శనివారం రాత్రి నుంచి సురేంద్ర పిచ్చిపిచ్చిగా ప్రవర్తించసాగాడని, ఆదివారం తెల్లవారు జూమున పనికి కూడా వెళ్లలేదని చెబుతున్నారు. తోటి కార్మికులు ఉదయం పని ముగించుకొని వచ్చేసరికి సురేంద్ర ఒంటిపై రక్తపు మరకలను చూసిన వారు యాజమాన్యానికి సమాచారం అందించారు. వారు క్వార్టర్‌లోకి వెళ్లి చూడగా, రక్తపు మడుగులో పడి ఉన్న ఉషను చూసి 108కు సమాచారం అందించారు. అంబులెన్స్‌ సిబ్బంది వచ్చి ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఉషను చిన్న గొడ్డలితో సురేంద్ర విచక్షణా రహితంగా నరకడంతో తీవ్ర రక్తస్రావమై చనిపోయినట్టు సీఐ తెలిపారు. పూర్తి వివరాలు సేకరిస్తున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించినట్టు వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement