కొత్తపేట: మనస్తాపానికి గురై ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. కొత్తపేట అడిషనల్ ఎస్సై వెంకటేశ్వరరావు కథనం ప్రకారం.. రావులపాలెం మండలం ముమ్మిడివరప్పాడు గ్రామానికి చెందిన అడపా ఈశ్వరరావు కుమార్తె భవానీ (21) కొత్తపేట మండలం అవిడి గ్రామంలో అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ పదో తరగతి వరకూ చదువుకుంది. రెండు నెలల క్రితం వివాహం నిశ్చయమైంది. ఇదిలా ఉండగా శనివారం రాత్రి భవానీ పినతల్లి కుమార్తె పుట్టినరోజు అమ్మమ్మ ఇంట్లోనే నిర్వహించారు. ఆ సందర్భంగా భవానీకి, ఆమె పినతల్లికి ఖర్చు విషయంలో వాగ్వాదం జరిగింది. దానితో మనస్తాపం చెందిన భవానీ రాత్రి ఇంట్లో ఉన్న పినాయిల్ తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది.
వెంటనే బంధువులు కొత్తపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారు జామున మృతి చెందింది. దీనిపై మృతురాలి తాత రేలంగి నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
వైద్యుల నిర్లక్ష్యం అంటూ ఆందోళన
భవానీకి వైద్యం అందించే విషయంలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం చేశారని ఆమె బంధువులు ఆరోపించారు. ఈ మేరకు అవిడి గ్రామానికి చెందిన పలువురు నాయకుల ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆస్పత్రికి వచ్చి వైద్యులు, సిబ్బందిని నిలదీశారు. సంబంధిత వైద్యుడు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దుర్గాప్రసాద్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా, పినాయిల్ తాగిన యువతికి డ్యూటీ డాక్టర్, సిబ్బంది తగిన చికిత్స అందించారని, అబ్జర్వేషన్‌లో ఉండగానే ఫిట్స్ వచ్చి మృతి చెందినట్టు తెలిపారు. అయితే ఆమె పినాయిల్ తాగిందా? లేక మరేదైనా తీసుకుందా? అనేది పోస్టుమార్టం రిపోర్టులో తేలాల్సి ఉందన్నారు.


