పరేషన్‌ మొదలై ఏడాది | - | Sakshi
Sakshi News home page

పరేషన్‌ మొదలై ఏడాది

May 31 2026 12:24 AM | Updated on May 31 2026 12:24 AM

రాజమహేంద్రవరం నగరంలోని ఓ రేషన్‌ షాపు వద్ద రాత్రి వేళ లబ్ధిదారుల పడిగాపులు (ఫైల్‌)

గత సంవత్సరం జూన్‌ 1 నుంచి

రేషన్‌ వాహనాల నిలిపివేత

ఇంటి వద్ద అందని సరకులు

చంద్రబాబు సర్కారు నిర్ణయంతో

లబ్ధిదారులకు ఇబ్బందులు

ఉమ్మడి జిల్లాలో రోడ్డున

పడిన 1,139 మంది

కపిలేశ్వరపురం: ఇంటికి దూరంగా ఉన్న రేషన్‌ షాపుల వద్దకు వెళ్లి, సరకులు మోసుకుని తెచ్చుకునేందుకు అవ్వాతాతలు, దివ్యాంగులు, రోజు కూలీలు, చిరుద్యోగులు గత చంద్రబాబు ప్రభుత్వ పాలనలో అనేక వ్యయప్రయాసలకు లోనయ్యేవారు. వారి ఇబ్బందులను తప్పించేందుకు గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. దేశంలోనే ఎక్కడా లేని విధంగా.. వినూత్నంగా ఇంటింటికీ రేషన్‌ పంపిణీ విధానానికి శ్రీకారం చుట్టారు. లబ్ధిదారుల సౌలభ్యం, ఉపాధి మేళవింపుతో ఈ వ్యవస్థను రూపొందించారు. దీనిలో భాగంగా మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్లు (ఎండీయూ – రేషన్‌ వాహనాలు) ఏర్పాటు చేసి, పలువురికి ఉపాధి కూడా కల్పించారు. 2021 జనవరి 21న విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ వద్ద 2,503 వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. అదే సంవత్సరం ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 12 పట్టణాల్లో ఇంటింటికీ రేషన్‌ సరకుల పంపిణీ ప్రారంభమైంది. పంచాయతీ ఎన్నికల కోడ్‌ కారణంగా గ్రామాల్లో కాస్త ఆలస్యంగా ఫిబ్రవరి 23న ఈ విధానం ప్రారంభమైంది.

రద్దు చేసి.. రోడ్డున పడేసి..

ఈ వ్యవస్థ ద్వారా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 18,81,494 రేషన్‌ కార్డులపై లబ్ధిదారులకు ఈ–పోస్‌ యంత్రం ద్వారా జీపీఎస్‌ ట్రాకింగ్‌ పద్ధతిలో నిత్యావసర సరకులను ఇళ్ల వద్దకే తీసుకెళ్లి అందించేవారు. తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లోని 1,139 మందికి ఎండీయూ నిర్వాహకులుగా ఉపాధి దక్కింది. పోలవరం జిల్లాలో కూడా పలువురు ఎండీయూ ఆపరేటర్లుగా సేవలందించారు. 2019 నవంబర్‌ నుంచి సుమారు రెండేళ్ల పాటు కరోనా వైరస్‌ వ్యాప్తితో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అత్యధిక రోజులు ఇళ్లకే పరిమితమైపోయారు. ఆ సమయంలో రేషన్‌ వాహనాల వ్యవస్థ ప్రజలకు ఎంతో ఉపకరించింది. అయితే, గత ఎన్నికల్లో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వైఎస్‌ జగన్‌ ఫొటో, ఆయన హయాంలో నిర్మించిన భవనాలు, ఆయన రూపొందించిన ప్రజోపయోగకరమైన పథకాలపై దుగ్ధతో వ్యవహరించనారంభించింది. ఇందులో భాగంగానే.. ఖజానాకు భారంగా మారిందన్న సాకుతో.. సరిగ్గా గత ఏడాది జూన్‌ ఒకటో తేదీ నుంచి రేషన్‌ వాహనాలను నిలిపివేసింది. 2027 వరకూ ఒప్పంద కాలం ఉన్నప్పటికీ చంద్రబాబు సర్కారు వీటిని రద్దు చేయడంతో లక్షలాది మంది రేషన్‌ లబ్ధిదారులకు మళ్లీ వ్యయప్రయాసలు తప్పని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఈ మూడు జిల్లాల్లో 1,139 మంది ఎండీయూ నిర్వాహకులు కూడా ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు.

రెండేళ్లుగా కానరాని కందిపప్పు

రేషన్‌ వాహనాల ద్వారా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కిలో కందిపప్పును రూ.67కే పంపిణీ చేసింది. దీంతో పాటు బియ్యం, పంచదార, గోధుమ పిండి వంటి నిత్యావసర సరకులనూ అందించింది. చంద్రబాబు అధికారం చేపట్టినప్పటి నుంచి కందిపప్పు సరఫరా నిలిచిపోయింది. దీంతో, కార్డుదారులు కిలో కందిపప్పును రూ.150 నుంచి రూ.190కి బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయాల్సి వస్తోంది.

ఇంటి వద్దకు తీసుకెళ్లి నిత్యావసర సరకులు అందజేస్తున్న

ఎండీయూ నిర్వాహకుడు (ఫైల్‌)

ఉమ్మడి జిల్లాలో రేషన్‌ కార్డులు, లబ్ధిదారులు, ఎండీయూ వాహనాల వివరాలు

జిల్లా రేషన్‌ మొత్తం మొత్తం ఎండీయూ

షాపులు కార్డులు లబ్ధిదారులు వాహనాలు

తూర్పు గోదావరి 871 5,73,197 15,68,969 364

కాకినాడ 926 6,54,000 16,81,387 420

కోనసీమ 926 5,47,723 16,43,169 355

Advertisement
 
Advertisement
Advertisement