● నిత్యం అసత్యాలతో కాలం వెళ్లదీస్తోంది
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు
పెరవలి (కొవ్వూరు): టీడీపీ ఓ అబద్ధాల ఫ్యాక్టరీ వంటిదని, నిత్యం అసత్యాలు వల్లిస్తూ కాలం వెళ్లదీస్తోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఆధ్వర్యాన కొవ్వూరులో శనివారం జరిగిన బూత్ కమిటీల కన్వీనర్ల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, టీడీపీ మహానాడులో చంద్రబాబు నాయుడు, ఆయన తాబేదార్లు మాట్లాడుతూ, ఆశా వర్కర్ల జీతాన్ని రూ.10 వేలు చేసింది తమ నాయకుడేనని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. గతంలో ఉద్యోగాల కోసం యువత ఎదురు చూసేదని, కానీ కూటమి అధికారం చేపట్టిన తరువాత యువత కోసం ఉద్యోగం ఎదురు చూస్తోందని హోం మంత్రి చెప్పడం చాలా దారుణంగా ఉందని మండిపడ్డారు. ఇప్పటికే కూటమిపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. దోచుకో.. దాచుకో అన్నట్టుగా కూటమి నేతలు దొరికింది దొరికినట్లు దోచేస్తున్నారని, ఇసుక, మట్టి, మద్యం షాపుల నుంచి అన్ని రంగాల్లోనూ దోపిడీ పెరిగిపోయిందని చెప్పారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలనలో ఇసుక ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.750 కోట్ల ఆదాయం వచ్చేదని, కానీ, ఉచిత ఇసుక పేరుతో కూటమి నాయకులు గాదె కింద పందికొక్కుల్లా దోచేస్తున్నారని వేణు ధ్వజమెత్తారు.
పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ సమన్వయకర్త డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ(సర్)పై ప్రతి ఒక్కరూ అవగాహనతో ఉండాలని కోరారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, దీనిని బతికించుకోవాలంటే యువతే ముందుకు రావాలని సూచించారు. గతంలో ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుంటే నేడు ప్రభుత్వాలే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నాయని, ఓట్ల తొలగింపే దీనికి ప్రధాన కారణమని అన్నారు. మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు మాట్లాడుతూ, సాధారణంగా ఎన్నికల్లో గెలుపోటములను ప్రజలు నిర్ణయిస్తారని, కానీ, ఈ కొత్త విధానంలో ప్రభుత్వాలే నిర్ణయిస్తాయని చెప్పారు. జూన్ నెలలో ఓట్ల తొలగింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని, నెల రోజుల పాటు ఆయా బూత్‌లలో ఏ ఓట్లు తొలగించవచ్చు, ఏవి ఉండాలో బూత్ కన్వీనర్లు జాగ్రత్తగా పరిశీలించాలని కోరారు. ఈ కార్యక్రమం జరుగుతున్న సమయంలో గ్రామంలోని ఇంటింటికీ వెళ్లి ఓట్లు ఉన్నాయో, తొలగించారో పరిశీలించుకోవాల్సిందిగా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. తొలుత దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహానికి నేతలు పూలమాల వేసి, నివాళులర్పించారు. సమావేశంలో కంఠమని రమేష్, పార్టీ కొవ్వూరు పట్టణ అధ్యక్షుడు చిట్టూరి అన్నవరం, తాళ్లపూడి ఎంపీపీ జొన్నకూటి పోసిరాజు, నాయకులు వెంపాటి సురేష్, కొలిశెట్టి నాగేశ్వరరావు, పరిమి సోమరాజు, సుంకర సత్యనారాయణ, గొరజాల పేర్రాజు, మట్టా వెంకట్రావు, పెండ్యల మమత, గోడసింగి తులసి, కొయ్యిలమూడి సుబ్బలక్ష్మి, గండ్రోతు సురేంద్ర, తోట రామకృష్ణ, పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు ఏలూరి విజయలక్ష్మి, బూత్ కన్వీనర్ల కమిటీ జిల్లా అధ్యక్షుడు గుర్రాల లక్ష్మణ్, ఉప్పులూరి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.
ఓట్లపై అప్రమత్తంగా ఉండాలి
ఇటీవల వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీలు ఓడిపోవడానికి ప్రధాన కారణం పలువురి ఓట్లు తొలగించడమేనని వేణు చెప్పారు. మన రాష్ట్రంలో కూడా వచ్చే నెల నుంచి ఓట్ల తొలగింపు కార్యక్రమం చేపడతున్నారన్నారు. చనిపోయిన, వలస వెళ్లిన వారి ఓట్లు తొలగించడం ఈ కార్యక్రమం ఉద్దేశమని, ఇదే అదనుగా అధికార పార్టీ నాయకులు ఓట్లు గల్లంతు చేసే అవకాశం ఉంటుందని, అందువలన వైఎస్సార్ సీపీ శ్రేణులు ప్రతి ఓటుపై అప్రమత్తంగా ఉండాలని అన్నారు.


