గోదావరి డెల్టాకు నేటి నుంచి సాగునీరు | - | Sakshi
Sakshi News home page

గోదావరి డెల్టాకు నేటి నుంచి సాగునీరు

May 31 2026 12:24 AM | Updated on May 31 2026 12:24 AM

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ఖరీఫ్‌ సాగు నిమిత్తం ధవళేశ్వరం బ్యారేజీ నుంచి గోదావరి కాలువలకు ఆదివారం నుంచి నీరు విడుదల చేయాలని జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం నిర్ణయించింది. కాలువల మరమ్మతుల పరిస్థితిని బట్టి దశల వారీగా నీరు విడుదల చేయనున్నారు. జాయింట్‌ కలెక్టర్‌ మేఘ స్వరూప్‌ అధ్యక్షతన కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రైతులు ముందస్తు నాట్లు వేసుకునేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. ధవళేశ్వరం బ్యారేజీ 175 గేట్ల మరమ్మతులు, బ్యారేజీ పరిరక్షణ చర్యలకు సుమారు రూ.148 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. ఇరిగేషన్‌ ఎస్‌ఈ జి.శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఖరీఫ్‌లో సాగునీటి కొరత తలెత్తే పరిస్థితి ఉండదని చెప్పారు. అక్టోబర్‌ 31వ తేదీ వరకూ సాగు, తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

మెగా డీఎస్సీ అక్రమాలపై

రేపు కలెక్టరేట్‌ వద్ద ధర్నా

పెరవలి (కొవ్వూరు): మెగా డీఎస్సీ–2025లో చోటు చేసుకున్న అక్రమాలపై రాజమహేంద్రవరంలోని కలెక్టరేట్‌ ఎదుట సోమవారం ఉదయం 10 గంటలకు ధర్నా నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కంఠమణి రమేష్‌ తెలిపారు. ఈ అక్రమాలకు బాధ్యుడిని చేస్తూ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలని, సీబీఐ లేదా సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్‌ చేస్తూ ఈ ధర్నా చేపడుతున్నామని వివరించారు. దీనికి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల యువజన విభాగం అధ్యక్షులు, నాయకులు, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగ యువత, వైఎస్సార్‌ సీపీ శ్రేణులు, అభిమానులు హాజరై, విజయవంతం చేయాలని రమేష్‌ కోరారు.

జిల్లా విజిలెన్స్‌ కమిటీ ఏర్పాటు

రాజమహేంద్రవరం సిటీ: జిల్లా స్థాయి విజిలెన్స్‌ కమిటీని ఏర్పాటు చేస్తూ కలెక్టర్‌ కీర్తి చేకూరి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో వినియోగదారుల సంఘాలు, సోషల్‌ యాక్టివిస్టుల నుంచి సభ్యులుగా గొట్టిముక్కల అనంతరావు, డీఎస్‌ రాజేశ్వరరావు, ధర్నాలకోట వెంకటేశ్వరరావు, బిక్కిన సత్యనారాయణ, సలాది ఉదయ భాస్కర్‌, యార్లగడ్డ రాణిలను నియమించారు. వీరు మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. కమిటీ చైర్మన్‌గా కలెక్టర్‌, కో చైర్మన్లుగా జెడ్పీ చైర్మన్లు, వైస్‌ చైర్మన్‌గా జాయింట్‌ కలెక్టర్‌, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్‌ సభ్యులు, జిల్లా అధికారులు సభ్యులుగా ఉంటారు. జాతీయ ఆహార భద్రత చట్టంలోని అన్ని పథకాల పర్యవేక్షణ, నిబంధనల ఉల్లంఘనలు, అవినీతి, నిధుల దుర్వినియోగం, అక్రమాలు, మధ్యాహ్న భోజన పథకం, సంక్షేమ పథకాల కింద సరఫరా చేస్తున్న ఆహార ధాన్యాలు, భోజనాల నాణ్యత పర్యవేక్షణకు ఈ కమిటీని ఏర్పాటు చేశారని అనంతరావు తెలిపారు.

రత్నగిరికి పోటెత్తిన భక్తులు

అన్నవరం: సత్యదేవుని ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. సుమారు 40 వేల మంది భక్తులు రావడంతో క్యూలు, వ్రత మండపాలు, ఆలయ ప్రాంగణం భక్తులతో రద్దీగా మారాయి. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. 2,200 వ్రతాలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. సుమారు 5 వేల మంది సత్యదేవుని అన్న ప్రసాదం స్వీకరించారు.

Advertisement
 
Advertisement
Advertisement