తాళ్లపూడి: కూటమి ప్రజాప్రతినిధుల అండతో కొవ్వూరు నియోజకవర్గంలో మట్టి మాఫియా చెలరేగిపోతోంది. నిబంధనలను తుంగలో తొక్కి మరీ చెరువులను గుల్ల చేస్తోంది. తాళ్లపూడి మండలం గజ్జరం గ్రామంలోని కృష్ణమ్మ చెరువును టార్గెట్ చేసిన మట్టి మాఫియా మూడు రోజులుగా రాత్రి, పగలు అనే తేడా లేకుండా యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు సాగిస్తోంది. స్థానిక టీడీపీ నాయకుల కనుసన్నల్లోనే ఈ దందా మొత్తం సాగుతున్నట్లు బహిరంగంగానే ఆరోపణలు వస్తున్నాయి. జలసిరి కార్యక్రమాన్ని అడ్డం పెట్టుకుని రైతుల పేరుతో పొక్లెయిన్లు, జేసీబీలతో భారీ స్థాయిలో చెరువు గర్భాన్ని తవ్వేసి ట్రాక్టర్లు, లారీలతో దూర ప్రాంతాలకు పెద్ద మొత్తంలో మట్టిని తరలిస్తున్నారు. సాధారణంగా చెరువుల్లో పూడికతీత పనులకు పరిమితులు, అనుమతులు ఉండాలి. కానీ, ఇక్కడ అవేమీ పట్టనట్లు మాఫియాయే అధికారులుగా, పరిశీలకులుగా వ్యవహరిస్తూ వందలాది ట్రాక్టర్లు, లారీలతో మట్టిని యథేచ్ఛగా దోచుకుపోతున్నారు. ట్రాక్టర్ మట్టిని రూ.1,500కు, లారీ మట్టిని ఏకంగా రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకూ విక్రయిస్తూ నిత్యం రూ.లక్షల్లో కొల్లగొడుతున్నారు. ఈ వ్యవహారమంతా అమాత్యులదేనంటూ ఆ ప్రాంతానికి అధికారులు రాకుండా ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. మూడు రోజులుగా కళ్ల ముందే ఇంత భారీ ఎత్తున మట్టి దందా సాగుతున్నా మైనింగ్, రెవెన్యూ, పోలీసు అధికారులు కన్నెత్తి కూడా చూడకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి కృష్ణమ్మ చెరువులో మట్టి అక్రమ తవ్వకాలను అరికట్టాలని, దోపిడీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు, వైఎస్సార్ సీపీ నాయకులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
గజ్జరం కృష్ణమ్మ చెరువులో
చెలరేగిన మాఫియా
టీడీపీ నాయకుల కనుసన్నల్లో
అక్రమ తవ్వకాలు
భారీ యంత్రాలతో 3 రోజులుగా దందా
ట్రాక్టర్ మట్టి రూ.1,500..
లారీ ఐదారు వేలకు విక్రయాలు


