సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి

May 31 2026 12:24 AM | Updated on May 31 2026 12:24 AM

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించడం ద్వారా పోలీసింగ్‌లో పారదర్శకత, పనితీరు మరింత మెరుగు పడతాయని ఎస్పీ డి.నరసింహ కిషోర్‌ అన్నారు. కంప్యూటర్‌ ఆపరేటర్లు, కోర్టు కానిస్టేబుళ్ల పని తీరుపై జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. పోలీస్‌ స్టేషన్లలో డేటా ఎంట్రీ, కేసుల రికార్డుల నిర్వహణ, సీసీటీఎన్‌ఎస్‌ నమోదు, డిజిటల్‌ డాక్యుమెంటేషన్‌, కోర్టు కేసుల పురోగతి, సమన్లు, వారెంట్ల అమలు, పెండింగ్‌ కోర్టు వ్యవహారాలపై సమీక్షించారు. కేసుల విచారణలో కోర్టు కానిస్టేబుళ్లు కీలక పాత్ర పోషిస్తారని, సమన్లు, వారెంట్ల అమలు, సాక్షుల హాజరు, కేసు డాక్యుమెంట్ల సమర్పణ వంటి అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. దర్యాప్తు అధికారులు, ప్రాసిక్యూషన్‌ అధికారులు, కోర్టు సిబ్బందితో సమన్వయం పెంపొందించుకోవడం ద్వారా కేసుల కన్విక్షన్‌ రేటును గణనీయంగా మెరుగు పరచవచ్చని వివరించారు. పోలీస్‌ స్టేషన్లలో డేటా నిర్వహణను కంప్యూటర్‌ ఆపరేటర్లు మరింత సమర్థవంతంగా చేపట్టాలన్నారు. సీసీటీఎన్‌ఎస్‌, ఇతర సాంకేతిక వ్యవస్థల వినియోగంలో ఎటువంటి లోపాలూ లేకుండా పని చేయాలని ఎస్పీ సూచించారు.

శాంతిభద్రతల ఎస్పీగా సుబ్బరాజు

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా శాంతిభద్రతల ఎస్పీగా అల్లూరి వెంకట సుబ్బరాజు నియమితులయ్యారు. ఈ మేరకు హోం శాఖ నుంచి శనివారం ఉత్తర్వులు వచ్చాయి. ఇప్పటి వరకూ రాజమహేంద్రవరం పోలీసు కార్యాలయంలో ఏఎస్పీగా పని చేసిన ఆయనకు ఎస్పీగా పదోన్నతి లభించింది. విజయనగరం జిల్లా రాచగుమడానికి చెందిన సుబ్బరాజు 1989లో ఎస్సైగా పోలీసు శాఖలోకి వచ్చారు. 2001లో సీఐగా, 2010లో డీఎస్పీగా, 2020లో అడిషనల్‌ ఎస్పీగా ఉద్యోగోన్నతి పొందారు. ఉగాది పురస్కారాల్లో భాగంగా సుబ్బరాజుకు ఏపీ పోలీస్‌ సేవా పతకం లభించింది.

Advertisement
 
Advertisement
Advertisement