రాజమహేంద్రవరం సిటీ: పేపర్ మిల్లు రసాయన వ్యర్థాల నుంచి గోదావరి జలాలను, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడతానన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వైఖరి ఒట్టి ప్రచారార్భాటమేనని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ విమర్శించారు. రాజమహేంద్రవరంలోని ఆ పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ, గోదావరిని ప్రక్షాళన చేస్తానన్న పవన్ కల్యాణ్.. రాజమహేంద్రవరం దాటిన వెంటనే మాట మార్చారన్నారు. 262 పంచాయతీలను మురుగు రహితంగా తీర్చిదిద్దాలనడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదన్నారు. పేపర్ మిల్లు తెరచి ఉండగా కాలుష్య రహిత పుష్కరాలు సాధ్యమేనా అనే విషయం పవన్‌కు అర్థం కాలేదన్నారు. ఈ మాత్రం దానికి మంత్రి, కలెక్టర్లపై విరుచుకుపడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. గోదావరి జలాలను శుద్ధి చేయమంటే పంచాయతీల మురుగును శుద్ధి చేస్తానంటున్న మాటలకు అర్థమేమిటో పవనే చెప్పాలన్నారు. రాజమహేంద్రవరంలో ఒకలా.. అమరావతిలో మరోలా మాట్లాడటానికి కారణమేమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పవన్ మాటలు వింటూంటే పేపర్ మిల్లు యాజమాన్యం ఆయనను రహస్యంగా కలిసిందా అనే అనుమానం కలుగుతోందన్నారు. గోదావరి జల, వాయు కాలుష్యాలు పవన్ శాఖ పరిధిలోనివేనని, కానీ, పర్యాటక మంత్రి దుర్గేష్‌పై చిర్రుబుర్రులాడటం ఆయనకే చెల్లిందని విమర్శించారు. గోదావరి జల, వాయు కాలుష్యం ప్రక్షాళనకయ్యే మొత్తం ఖర్చును పేపర్ మిల్లు యాజమాన్యమే భరించాలని, ఈ మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు.


