వెలి ఘటనపై తహసీల్దార్‌ విచారణ | - | Sakshi
Sakshi News home page

వెలి ఘటనపై తహసీల్దార్‌ విచారణ

May 31 2026 12:18 AM | Updated on May 31 2026 12:18 AM

తాళ్లరేవు: కోరంగి పంచాయతీ పాత కోరంగికి సంబంధించిన వెలి ఘటనపై శనివారం తహసీల్దార్‌ పితాని త్రినాథరావు విచారణ నిర్వహించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు తహసీల్దార్‌ కార్యాలయంలో జరిగిన ఈ విచారణకు ఒకే సామాజిక వర్గానికి చెందిన గ్రామ పెద్దలతో పాటు బాధిత కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాధితుడు టేకుమూడి త్రిమూర్తులు మాట్లాడుతూ గ్రామపెద్దలు తమ కుటుంబానికి రూ.లక్ష జరిమానా విధించి, వెలివేశారని తెలిపాడు. గత మూడేళ్లుగా తమ కుటుంబాన్ని శుభ కార్యక్రమాలకు పిలవడం లేదని వాపోయాడు. తన కుమార్తె వివాహాన్ని కూడా చెడగొట్టారని, తాను పండించిన ధాన్యాన్ని కూడా కొనకుండా చేసి నష్టపరిచారన్నాడు. తప్పు కట్టాలని, లేకుంటే ఊరి నుంచి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారని వాపోయాడు. దీనిపై గతంలో కోరంగి పోలీసులకు ఫిర్యాదు చేయగా శాంతి కమిటీ వేసి సమస్యను పరిష్కరించారని, అయితే గ్రామ పెద్దల తీరులో మార్పు రాలేదన్నాడు. దీంతో గత ఏడాది అక్టోబర్‌లో నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలిపాడు. కాగా.. సమస్యను గ్రామంలో తేల్చుకుంటామని, రెండు రోజులు సమయం ఇవ్వాల్సిందిగా తహసీల్దార్‌ను గ్రామ పెద్దలు కోరారు. ఈ నేపథ్యంలో విచారణను వచ్చే నెల 3వ తేదీకి వాయిదా వేశారు. సమస్య పరిష్కారం కాకుంటే చట్టం తన పని తాను చేసుకుని పోతుందని తహసీల్దార్‌ హెచ్చరించారు. సమావేశంలో శెట్టిబలిజ కార్పొరేషన్‌ రాష్ట్ర డైరెక్టర్‌ టేకుమూడి లక్ష్మణరావు, ఎంపీడీఓ కె.సత్యనారాయణ, కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ, ప్రజా సంఘాల నాయకుడు టేకుమూడి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement