దగా డీఎస్సీపై ఆగ్రహం | - | Sakshi
Sakshi News home page

దగా డీఎస్సీపై ఆగ్రహం

May 30 2026 2:44 AM | Updated on May 30 2026 2:44 AM

ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్‌): మెగా డీఎస్సీ–2025లో జరిగిన అక్రమాలపై సీబీఐ లేదా సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ డిమాండ్‌ చేశారు. మెగా డీఎస్సీ నిర్వహణలో లోపాలు, ప్రశ్నపత్రం లీకేజీ, మెరిట్‌ జాబితా తొలగింపు, ఇతర అక్రమాలను నిరసిస్తూ.. అన్యాయానికి గురైన అభ్యర్థులకు అండగా.. వైఎస్సార్‌ సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యాన స్థానిక కోటిపల్లి బస్టాండ్‌ సెంటర్‌లో శుక్రవారం ఆందోళన నిర్వహించారు. కందుకూరి వీరేశలింగం విగ్రహం వద్ద నుంచి ర్యాలీగా బయలుదేరి, శ్యామలా సెంటర్‌ మీదుగా కోటిపల్లి బస్టాండ్‌ సెంటర్‌కు చేరుకుని నిరసన తెలిపారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేశారు. మెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ సకల శాఖా మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ, డీఎస్సీ నిర్వహణలో పారదర్శకత కొరవడిందని ఆరోపించారు. మెగా డీఎస్సీ కాస్తా ఒట్టి దగా డీఎస్సీగా తేలిందన్నారు. రూ.15 లక్షలు చెల్లిస్తే స్పోర్ట్స్‌ కోటా పోస్టుల్లో నియమించారన్నారు. క్రీడలంటే తెలియని వ్యక్తులకు ఈ కోటాలో ఉద్యోగాలిచ్చేశారని ఆరోపించారు. ఈ అక్రమాలను ఎత్తి చూపుతూ అన్యాయానికి గురైన 200 మంది అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లగా, న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు. కానీ, కోర్టు ఉత్తర్వులను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అమాయకులపై కేసులు పెట్టడమే రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గ, రాక్షస పాలనకు నిదర్శనమని వేణు ధ్వజమెత్తారు. ప్రశ్నపత్రం తయారు చేసే సంస్థలోని కాంట్రాక్టు ఉద్యోగికి డీఎస్సీలో కృష్ణా జిల్లా మొదటి ర్యాంకు రావడం, మెరిట్‌ జాబితాలు కనిపించకుండా చేయడం వంటి చర్యలతో అభ్యర్థుల్లో అనేక అనుమానాలు నెలకొన్నాయని అన్నారు. వీటిని తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వమే తప్పు చేసినందున ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు భావిస్తున్నారని విమర్శించారు. మహానాడు వేదికగా టీడీపీ నేతలు చేస్త్న్ను వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని, రాష్ట్రంలో ఏర్పాటవుతున్న కంపెనీలు ఉద్యోగుల కోసం వెతుక్కునే పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయనన్నారు. అధికారంలో ఉండి ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే రీతిలో కూటమి ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగేంత వరకూ వారికి వైఎస్సార్‌ సీపీ అండగా ఉండి పోరాటం చేస్తుందని వేణు స్పష్టం చేశారు.

వైఎస్సార్‌ సీపీ విద్యార్ధి విభాగం జిల్లా అధ్యక్షుడు మానుకొండ చంద్రబాబు మాట్లాడుతూ, విద్య, వైద్య వ్యవస్థలను చంద్రబాబు ప్రభుత్వం నాశనం చేస్తోందని విమర్శించారు. చైతన్య, నారాయణ విద్యా సంస్థలను ప్రోత్సహిస్తూ, ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటాలో ఒక్కో పోస్టును రూ.15 లక్షల చొప్పున అమ్మేశారని వస్తున్న ఆరోపణలపై చంద్రబాబు సమాధానం చెప్పాలని, మెగా డీఎస్సీ స్కామ్‌కు బాధ్యత వహిస్తూ విద్యా శాఖా మంత్రి నారా లోకేష్‌ బేషరతుగా రాజీనామా చెయ్యాలని డిమాండ్‌ చేశారు. నిరుద్యోగులకు న్యాయం జరిగేంత వరకూ వైఎస్సార్‌ సీపీ విద్యార్థి విభాగం పోరాటం చేస్తుందని చంద్రబాబు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వక్ఫ్‌బోర్డు మాజీ చైర్మన్‌ మహ్మద్‌ ఆరిఫ్‌, విద్యార్థి విభాగం నిడదవోలు, రాజమండ్రి రూరల్‌, రాజానగరం నియోజకవర్గాల అధ్యక్షులు రొట్టె నవీన్‌ కుమార్‌, ఉత్తేజ్‌, కల్యాణ్‌, విద్యార్థి సంఘ నాయకులు పండు, తగరం సోము, వినోద్‌, ఇన్నీసుపేట కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ వైస్‌ చైర్మన్‌ గేడి అన్నపూర్ణరాజు, మాజీ కార్పొరేటర్లు మానే దొరబాబు, అరవ సురేష్‌ కుమార్‌, పార్టీ నేతలు కోడి కోట, అడపా అనిల్‌, కేతా స్వరూప్‌, దుంగా సురేష్‌, పవన్‌ కుమార్‌ పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీ విద్యార్థి విభాగం నిరసన

మెగా డీఎస్సీ–2025 అక్రమాలపై

సీబీఐ విచారణ

పార్టీ జిల్లా అధ్యక్షుడు

చెల్లుబోయిన వేణు డిమాండ్‌

Advertisement
 
Advertisement
Advertisement