● పలు మండలాల్లో ప్రకృతి బీభత్సం
● ఈదురు గాలులు, కుండపోత వర్షంతో
అతలాకుతలం
● నేలకూలిన చెట్లు, అరటి, కంద తోటలు
● ఒరిగిన విద్యుత్ స్తంభాలు
పెరవలి/తాళ్లపూడి/సీతానగరం/దేవరపల్లి: జిల్లా లోని పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి బలమైన ఈదురు గాలులు, కుండపోత వర్షం బీభత్సం సృష్టించాయి. తీవ్రమైన గాలులు ప్రజలను హడలెత్తించాయి. గాలులు, వర్షం ప్రభావంతో అరటి, కొబ్బరి, మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. విద్యుత్ స్తంభాలు నేల కూలాయి. జిల్లావ్యాప్తంగా 6 వేల హెక్టార్లలో అరటి సాగు జరుగుతూండగా ఇందులో ఈనిన తోటలు 4 వేల హెక్టార్లు ఉన్నాయి. గాలుల తాకిడికి 800 హెక్టార్లలో తోటలు నేలమట్టమయ్యాయన్నది అధికారులు ప్రాథమిక అంచనా. ఒక్క నిడదవోలు నియోజకవర్గంలోనే 1,257 ఎకరాల్లో అరటి పంట నాశనమైందంటూ అధికారులు నివేదికలు ఇచ్చారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ప్రకృతి వైపరీత్యాలకు పంట నష్టం జరిగితే, వెంటనే బీమా వచ్చేది. కానీ, కూటమి సర్కారు ఈ బీమాను తీసివేయటంతో ఒక్క పైసా కూడా రాదని, కనీసం ప్రభుత్వమైనా నష్టపరిహారం ఇవ్వడం లేదని ఆవేదన చెందుతున్నారు. గాలుల తాకిడికి అన్నవరప్పాడు వేంకటేశ్వరస్వామి ఆలయంలో చలువ పందిరి కూలిపోయింది. జాతీయ రహదారిపై పెద్ద సంఖ్యలో చెట్లు విరిగి పడటంతో పెరవలి – తణుకు మధ్య సుమారు రెండు గంటల పాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
● తాళ్లపూడి మండలంలో కేవలం 20 నిమిషాల పాటు వీచిన గాలులు, కురిసిన కుంభవృష్టితో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. ఇళ్లపై రేకులు, ఫ్లెక్సీలు గాలికి ఎగిరిపోయాయి. వందలాది ఎకరాల్లో అరటి, కంద తోటలు నేలవాలాయి. చాలాచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. తీగలు తెగిపోవడంతో గురువారం రాత్రి 7 గంటల నుంచే చాలా గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
● సీతానగరం మండలం పురుషోత్తపట్నం రైతు సేవా కేంద్రం పిడుగు పడి, ధ్వంసమైంది. పిడుగుపాటుకు చెలరేగిన మంటల్లో అందులోని గోనె సంచులు, ఇతర వస్తువులు దగ్ధమయ్యాయి. పలు గ్రామాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగి పడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.
● ఈదురు గాలుల బీభత్సానికి గోపాలపురం నియోజకవర్గంలోని మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. కాయలు పూర్తిగా నేల రాలాయి. నల్లజర్ల మండలంలో మామిడికి ఎక్కువ నష్టం వాటిల్లింది. టన్ను కాయల ధర రూ.20 వేలు పలికేదని, ఇప్పుడు కాయలు రాలిపోవడంతో ధర దారుణంగా రూ.4 వేలకు పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


