ఆట్యా పాట్యా ఆడేద్దామా.. | - | Sakshi
Sakshi News home page

ఆట్యా పాట్యా ఆడేద్దామా..

May 30 2026 2:44 AM | Updated on May 30 2026 2:44 AM

కాకినాడ, కోనసీమ జిల్లాల్లో శిక్షణ కేంద్రాలు

రాణిస్తే విద్యా, ఉద్యోగాల్లో అవకాశాలు

నాగమల్లితోట జంక్షన్‌ (కాకినాడ సిటీ): ఆట్యా పాట్యా.. ఇది మన దేశ ప్రాచీనమైన సంప్రదాయ క్రీడ. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత ప్రజాదరణ పొందింది. మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లోనూ ప్రాచుర్యం పొందుతుంది. ఇప్పటికే కాకినాడ, కోనసీమ జిల్లాల్లో శిక్షణ కేంద్రాలు నడుస్తున్నాయి. ఆట్యా పాట్యా క్రీడా చరిత్ర, కోర్టు కొలతలు, నియమ నిబంధనలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం ఇది. ఆట్యాపాట్యా క్రీడ ఐదు వేల ఏళ్ల నాటి చోళుల కాలం నుంచి ఉనికిలో ఉందని చరిత్రకారులు చెబుతారు. తమిళనాడలో పురాతన సంఘం సాహిత్యం ‘నత్రినై’లో ఈ ఆటకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. దీనిని తమిళనాడలో కిలితట్టు లేదా ఉప్పుపట్టి అని కూడా పిలుస్తారు. ఆధునిక నియమాలను రూపొందించి జాతీయ స్థాయిలో ప్రాచుర్యం తెచ్చేందుకు పూణెలోని డెక్కన్‌ జింఖానా తొలి ప్రయత్నం చేసింది.

ఉమ్మడి తూర్పు గోదావరిలో..

ఉమ్మడి తూర్పు గోదావరిలో కాకినాడ జిల్లా తునిలో, కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కొత్తలంకలో ఆట్యాపాట్యా క్రీడా శిక్షణ కేంద్రాలు నడుస్తున్నాయి. కొత్తలంకలో ఆరు నెలల కిందట ఈ శిక్షణ కేంద్రం ఏర్పాటైంది. ఈ ఏడాది 100 మంది పిల్లలు ఎన్‌రోల్‌ చేసుకున్నారు. ఆట్యాపాట్యాని మూన్‌లైట్‌ గేమ్‌ అని కూడా అంటారు. ఇందులో రాణిస్తే సెంట్రల్‌ గవర్నమెంట్‌, పోస్టల్‌ ఉద్యోగాల్లో క్రీడా కోటా ఉంటుంది. సబ్‌ జూనియర్స్‌ బాలురు, బాలికలు 24, జూనియర్స్‌ బాలురు, బాలికలు 24, సీనియర్స్‌ బాలురు, బాలికలు 24 చొప్పున సంవత్సరానికి 72 మంది, 2020 నుంచి ఇప్పటి వరకూ 360 మంది జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. పాఠశాల క్రీడా సమాఖ్య అండర్‌–14, 17, 19 కేటగిరీల్లో ఈ క్రీడను చేర్చితే చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులకు ఉపయోగపడుతుందని పీడీలు చెబుతున్నారు.

క్రీడాభివృద్ధికి చర్యలు

ఆట్యాపాట్యా క్రీడాభివృద్ధికి చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం తోడ్పాటు అందిస్తే మరింత మంది గ్రామీణ స్థాయి క్రీడాకారులకు ఈ క్రీడ చేరువ అవుతుంది. తక్కువ ఆట స్థలంలో, తక్కువ పరికరాలతో దీనిని ఆడుకోవచ్చు.

–గంగుల లోవలక్ష్మి, కార్యదర్శి,

ఆట్యాపాట్యా క్రీడా సంఘం, కోనసీమ

ఆట స్థలం: ఆట స్థలంలో మొత్తం తొమ్మిది అడ్డ కందకాలు (కారిడార్లు), మధ్యలో ఒక పొడవైన కేంద్ర కందకం (సెంట్రల్‌ ట్రెంచ్‌) ఉంటాయి. మొత్తం తొమ్మిది కందకాలు ఒక్కొక్కటి 23 అడుగుల 1 అంగుళం పొడవు, 13 అంగుళాలు వెడల్పుతో ఉంటుంది.

నియమాలు: ఆటగాళ్లు ఒక్కో జట్టులో మొత్తం 9 మంది ఆటగాళ్లు చొప్పున 18 మంది ఉంటారు. రక్షకులు డిఫెండింగ్‌ జట్టులోని ఆటగాళ్లు కందకంలో నిలబడి, ప్రత్యర్థిని క్రాస్‌ చేయకుండా అడ్డుకుంటారు. దాడులు చేసేవారు ఒక కందకం నుంచి మరో కందకానికి దూకుతూ, రక్షకుల చేతికి చిక్కకుండా క్రాస్‌ చేయాలి.

స్కోరింగ్‌ : దాడి చేసే జట్టు ఆటగాళ్లు రక్షకుల చేత ట్యాగ్‌ చేయబడకుండా దాటిన ప్రతి కందకానికి ఒక పాయింట్‌ లభిస్తుంది. ఆట మొత్తం 7 నిమిషాల చొప్పున రెండు ఇన్నింగ్స్‌గా జరుగుతుంది. ఏ జట్టు ఎక్కువ పాయింట్లు స్కోర్‌ చేస్తే అది విజేతగా నిలుస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement