తుని రూరల్: తుని మండలం తేటగుంట శివారు ఆర్టీఏ పాత చెక్‌పోస్ట్ వద్ద లారీ ఢీకొనడంతో మోటార్ సైకిల్‌పై వెళ్తున్న భార్యాభర్తలు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం జరిగిన ఈ సంఘటనలో తొండంగి మండలం సీతారామపురం గ్రామానికి చెందిన దంపతులు గొర్లి సత్యనారాయణ, గొర్లి అప్పలరాజు (లక్ష్మి) తీవ్రంగా గాయపడి, అపస్మారక స్థితికి చేరుకున్నారు. మోటారు సైకిల్‌ను లారీ కొంతదూరం ఈడ్చుకుపోవడంతో లక్ష్మి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సమాచారం అందడంతో 108 అంబులెన్స్‌లో క్షతగాత్రులను తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సత్యనారాయణ, లక్ష్మిలను కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తునిలో రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వస్తుండగా, ఈ ప్రమాదం సంభవించినట్టు తెలుస్తుంది. ఈ మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నిజాయతీ చాటుకున్న సిబ్బంది
తుని రిజిస్ట్రేషన్ కార్యాలయానికి మోటార్ సైకిల్‌పై వస్తుండగా, జరిగిన ప్రమాదంలో గొర్లి సత్యనారాయణ, లక్ష్మి తీవ్రంగా గాయపడగా, వారికి చెందిన రూ.1.10 లక్షల నగదు బ్యాగ్ సంఘటనా స్థలానికి దూరంగా పడిపోయింది. దీనిని గమనించిన 108 అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రులతో పాటు నగదును ఆస్పత్రి వద్దకు తీసుకువచ్చారు. విధి నిర్వహణలో ప్రాణాలు కాపాడడంతో పాటు 108 ఈఎంటీ సూర్య, పైలెట్ అప్పారావు తమ నిజాయతీ చాటుకున్నారు. సంఘటనా స్థలంలో దొరికిన నగదు బ్యాగ్‌ను క్షతగాత్రుల బంధువులకు అప్పగించారు.


