పెద్ద పులిని బంధించేందుకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

పెద్ద పులిని బంధించేందుకు చర్యలు

May 30 2026 2:44 AM | Updated on May 30 2026 2:44 AM

రాజానగరం/

గంగవరం: గంగవరం మండలంఆర్‌డీ పురంలో పెద్ద పులి సంచరిస్తుందని, దానిని సురక్షితంగా బంధించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామని రాజమహేంద్రవరం సర్కిల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ డాక్టర్‌ జ్యోతి తుళ్లిమెల్లి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఆ ప్రాంతంలో పర్యటించారు. వేములోవ గ్రామంలో కూడా ఆమె పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. ఇక్కడ రెండు ఆవులు చనిపోయాయని, నష్టపరిహారం అందించాలని ప్రజలు ఆమెను కోరారు. తగిన పరిహారం అందిస్తామని జ్యోతి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలోని కూర్మాపురంలో పట్టుకుని, గత ఫిబ్రవరి 14న పాపికొండలు జాతీయ వనంలో విడుదల చేసినప్పటి నుంచి పెద్ద పులి సంచారంపై నిరంతరం నిఘా ఉంచామన్నారు. అయితే రెండోసారి దానిని ఇంతవరకూ పట్టుకోలేకపోవడానికి గల కారణాలను వివరిస్తూ, అది దట్టమైన అటవీ ప్రాంతం, మారుమూల ఆవాసాలలో రాత్రి వేళల్లో సంచరించడమేనన్నారు. అప్పుడప్పుడు పశువులపై దాడులు చేస్తుందన్నారు. ఈ క్రమంలోనే రాజవొమ్మంగి రేంజ్‌ పరిధిలోని పెదరేలంగిపాడు, చికిలింతల వద్ద ఈ నెల 27న తొమ్మిది పశువులను హతమార్చిందన్నారు. దీంతో పైఅధికారుల సూచనల మేరకు ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఫీల్డ్‌ టీమ్స్‌, హనుమాన్‌ టీమ్స్‌ని మోహరింపజేశామన్నారు. అలాగే రేడియో టెలీమెట్రీ, వీహెచ్‌ఎఫ్‌ ట్రాకింగ్‌, కెమెరా ట్రాప్‌లు, డ్రోన్‌ పర్యవేక్షణ, విస్త్రత క్షేత్ర స్థాయి గస్తీ ద్వారా పులిపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement