శుక్రవారం శ్రీ 29 శ్రీ మే శ్రీ 2026
● మొక్కజొన్న కొనుగోలు చేయని ప్రభుత్వం
● ఎక్కడికక్కడ పేరుకుపోయిన నిల్వలు
● క్వింటాల్‌కు మద్దతు ధర రూ.2,100
● రూ.1,600కు అడుగుతున్న దళారులు
● దిక్కు తోచని స్థితిలో రైతులు
పెరవలి: మొక్కజొన్న రైతులను ప్రభుత్వం దళారులకొదిలేసింది. దండిగా దిగుబడి వచ్చిన వేళ.. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయకపోవడంతో రైతులు దిక్కు తోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గత్యంతరం లేక రైతులు.. దళారులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇదే అదనుగా వారు అయిన కాడికి అడుగుతూ, రైతు కష్టాన్ని దోచుకుంటున్నారు.
16,713 ఎకరాల్లో..
జిల్లావ్యాప్తంగా 16,713 వేల ఎకరాల్లో రైతులు మొక్కజొన్న సాగు చేస్తున్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది పంట విస్తీర్ణం 1,500 ఎకరాలు పెరిగింది. దీంతోపాటు గతంలో దిగుబడి 30 క్వింటాళ్లు వస్తే ఈ ఏడాది 35 నుంచి 40 క్వింటాళ్ల వరకూ వస్తోంది. దండిగా దిగుబడి వస్తున్నా ప్రభుత్వం ఎక్కడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వ నిర్వాకంతో ఎక్కడి నిల్వలు అక్కడే పేరుకుపోయాయి. సరిగ్గా ఇదే సమయంలో దళారులు రంగంలోకి దిగారు. క్వింటాల్ మొక్కజొన్నకు ప్రభుత్వ మద్దతు ధర రూ.2,100 కాగా, దళారులు అరువు అయితే రూ.1,800, వెంటనే నగదు ఇవ్వాలంటే రూ.1,600కే అడుగుతున్నారు. పంటను నిల్వ చేసుకోలేక, తక్కువ ధరకు అమ్ముకోలేక రైతులు నానా అగచాట్లూ పడుతున్నారు. అప్పు చేసి, సాగు చేసిన కొందరు రైతులు మాత్రం మరో దారి లేక అయిన కాడికి అమ్ముకోవాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నారు.
పడిపోయిన ప్రభుత్వ ‘మద్దతు’
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో మొక్కజొన్న రైతులకు మంచి గిట్టుబాటు ధర లభించింది. 2019 నుంచి 2024 వరకూ మొక్కజొన్న రైతులకు స్వర్ణయుగమనే చెప్పాలి. గత ప్రభుత్వంలో ఽక్వింటాల్ మద్దతు ధర రూ.2,600 ఉండగా.. నేడు ప్రభుత్వం రూ.2,100కు తగ్గించింది. మద్దతు ధర ప్రకటనతోనే రైతులకు లాభం సగానికి సగం తగ్గిపోయినట్లయ్యింది. ఎకరం మొక్కజొన్న సాగుకు రూ.55 వేల వరకూ పెట్టుబడి అవుతోంది. మద్దతు ధర ప్రకారం రైతులకు లాభం చేకూరాలి. కానీ, ప్రభుత్వం దళారులకు వదిలేయడంతో దారుణంగా నష్టపోతున్నామని మొక్కజొన్న రైతులు వాపోతున్నారు. దళారులు చెబుతున్న రూ.1,600 రేటుకు పెట్టుబడి సొమ్ము మాత్రమే వస్తోందని అంటున్నారు. అదే కౌలు రైతులైతే ఏమాత్రం మిగులకపోగా చేతి సొమ్ము పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది.
దెబ్బ మీద దెబ్బ
గత ఏడాది మొక్కజొన్న పంట చేతికి వచ్చే సమయంలో బర్డ్‌ప్లూ సోకి లక్షలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. మొక్కజొన్న దిగుబడిలో 80 శాతం కోళ్ల ఫారాలకు మేతగా వెళ్లేది. ఇప్పుడు కోళ్ల పరిశ్రమ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటూండటంతో వినియోగం అంతంత మాత్రంగానే ఉంది. దీనికి తోడు ఈ ఏడాది ఇబ్బడిముబ్బడిగా దిగుబడులు వచ్చినా గిట్టుబాటు ధర దక్కకపోవడంతో రైతులకు దెబ్బ మీద దెబ్బ తగిలినట్లయ్యింది.
నష్టపోతున్నాం
మొక్కజొన్న రైతుల పట్ల ప్రభుత్వం ఉదాసీన వైఖరి అవలంబిస్తోంది. కేవలం మద్దతు ధర ప్రకటించి చేతులు దులుపుకొంది. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో నష్టపోవాల్సి వస్తోంది. గత ప్రభుత్వంలో ఈ పరిస్థితి లేదు.
– మిద్దే వీరాంజనేయులు,
రైతు, కానూరు అగ్రహారం
ఏమిటీ దారుణం?
మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో, దళారులను ఆశ్రయించాల్సి వస్తోంది. మద్దతు ధర రూ.2,100 ఉంటే దళారులు కేవలం రూ.1,600కు అడుగుతున్నారు. ఏమిటీ దారుణం?.
– జన్ని వెంకటేశ్వర్లు, రైతు, కానూరు


