● గంటపాటు దంచి కొట్టిన వాన
● తోడైన ఈదురు గాలులు
● విద్యుత్ సరఫరాకు అంతరాయం
దేవరపల్లి: పగలంతా 43 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదైన ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు, ఉక్కపోతతో సతమతమైన జిల్లా ప్రజలు.. గురువారం రాత్రి ఒక్కసారిగా కురిసిన కుండపోత వర్షంతో సేద తీరారు. దేవరపల్లి, రాజమహేంద్రవరం, రాజానగరం తదితర ప్రాంతాల్లో గురువారం సాయంత్రం 6 గంటలకు వాతావరణం చల్లబడింది. ఉన్నట్టుండి ఆకాశం మేఘావృతమై, బలమైన ఈదురు గాలులు వీచాయి. చూస్తూండగానే మొదలైన వాన దాదాపు గంట నుంచి రెండు గంటల పాటు దంచి కొట్టింది. రాత్రి కూడా చిరుజల్లులు పడుతూనే ఉన్నాయి. వాతావరణం చల్లబడటంతో ఉష్ణతాపం నుంచి ప్రజలు ఉపశమనం పొందారు. మెట్టతో పాటు పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. పలుచోట్ల చెట్ల కొమ్మలు, హోర్డింగులు పడిపోయాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. బలమైన గాలులకు జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కొన్నాళ్లుగా నమోదవుతున్న తీవ్ర ఉష్ణోగ్రతలకు ఎండిపోతున్న ఉద్యాన పంటలు జీవం పోసుకున్నాయి.
నేలకొరిగిన భారీ వృక్షాలు, విద్యుత్తు స్తంభాలు
పెదపూడి: మండలంలోని చింతపల్లి – జి.మామిడాడ గ్రామాల మధ్య ఆర్‌అండ్‌బీ రోడ్డులో గురువారం ఉదయం వీచిన ఈదురు గాలులకు సుమారు 50 భారీ వృక్షాలు, 20 విద్యుత్తు స్తంభాలు నేల కూలాయి. దీంతో, ఉదయం 10 గంటల నుంచి ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. గాలుల తాకిడికి రాజుపాలెం, గండ్రేడు గ్రామాల్లో రెండు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బ తిన్నాయి. ఫలితంగా రాజుపాలెం, పైన, వేండ్ర గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుని, సాయంత్రానికి సరఫరాను పునరుద్ధరించారు. డిప్యూటీ ఎంపీడీఓ మేడపాటి సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యాన గ్రామ పంచాయతీ, ఇతర అధికారులు, స్థానికుల సహాయంతో రోడ్డుపై విరిగి పడిన భారీ వృక్షాలను తొలగించారు.


