విద్యుత్‌ కోతలపై మహిళల నిరసన | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ కోతలపై మహిళల నిరసన

May 29 2026 10:20 AM | Updated on May 29 2026 10:20 AM

మద్దతుగా నిలిచిన వైఎస్సార్‌ సీపీ

సబ్‌ స్టేషన్‌ను ముట్టడించిన నాయకులు

కాట్రేనికోన: విద్యుత్‌ శాఖ ఇష్టారాజ్యంగా కోతలు విధించడంతో కాట్రేనికోన విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ను ముట్టడించిన మహిళలకు మద్దతుగా వైఎస్సార్‌ సీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఇటీవల మండల కేంద్రంతో పాటు శివారు ప్రాంతాల వారు కరెంట్‌ కోతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వైఎస్సార్‌ సీపీ నాయకులు మండిపడ్డారు. మండలంలో విద్యుత్‌ లైన్లు 1996 తుపానుకు వేసినవి కావడంతో శివారు ప్రాంతాల్లో పాడైపోయాయని, మరమ్మతులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. నెల రోజుల నుంచి ఓఎన్‌జీసీ (వేదాంత) సంస్థకు చెందిన భారీ వాహనాల రాకపోకల కోసం రాత్రి, పగలు అనే తేడా లేకుండా విద్యుత్‌ కోతలు విధిస్తున్నారని వైఎస్సార్‌ సీపీ మండల కన్వీనర్‌ నల్లా నరసింహమూర్తి, యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు గంటి వెంకట సుధాకర్‌ అన్నారు. కరెంట్‌ లేక మహిళలు, వృద్ధులు చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కాట్రేనికోన, ఉప్పూడి ఫీడర్‌ నుంచి వేట్లపాలెం, సత్తెమ్మ చెట్టు, రాజానగరం, కాపులపాలెం, నాగపట్టణం, మర్రిచెట్టు కాలనీ, గచ్చకాయలపోర, చిర్రయానంలకు కరెంట్‌ కోత అధికంగా ఉండటంపై మండిపడ్డారు. సిబ్బంది అలసత్వంపై విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ బి.రాజరాజేశ్వరికి ఫోన్‌లో వివరించారు. సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. వైఎస్సార్‌ సీపీ నాయకులు సంగాని మునేంద్ర, కముజు మల్లికార్జునరావు, రంబాల శ్రీను, నల్లా చిన్నాజీ, గిడ్ల శ్రీనివాసరావు, నీలం బాలయ్య పాల్గొన్నారు.

విద్యార్థినికి అబార్షన్‌పై

డీఎంహెచ్‌ఓ విచారణ

అమలాపురం టౌన్‌: స్థానిక నల్ల వంతెన ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఇంటర్‌ విద్యార్థినికి అబార్షన్‌ చేసిన ఘటనపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) ఎం.దుర్గారావుదొర, అడిషనల్‌ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ భరతలక్ష్మి విచారణ చేపట్టారు. ఆ ఆస్పత్రికి వెళ్లి విద్యార్థినికి అబార్షన్‌ చేసిన విధానం, కేస్‌ షీటు తదితర అంశాలను పరిశీలించారు. అబార్షన్‌కు వాడిన మందులు, కేస్‌షీటులో పేర్కొన్న మందులకు పొంతన లేదని గుర్తించారు. విచారణ అంశాలను కలెక్టర్‌ మహేష్‌కుమార్‌కు వివరించారు. ఈ నేపథ్యంలో ఆర్‌డీఓ జి.మమ్మీ, డీఎంహెచ్‌ఓ దుర్గారావుదొర, ఐసీడీఎస్‌ పీఓ కె.నాగమణి తదితర అధికారులతో కలెక్టర్‌ ఓ కమిటీని నియమించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేయాలని ఆదేశించారు. విచారణ నివేదికను కలెక్టర్‌కు రెండు రోజుల్లో అందజేస్తామని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ దుర్గారావుదొర తెలిపారు.

మూతపడిన ఆస్పత్రి

ఈ ఘటనతో విద్యార్ధినికి అబార్షన్‌ చేసిన ఆస్పత్రిని తాత్కాలికంగా మూసివేయాలని డీఎంహెచ్‌ఓ ఆస్పత్రి వైద్యురాలు శిరీషను ఆదేశించారు. ఆస్పత్రిలో అబార్షన్‌ అయి, చికిత్స పొందుతున్న విద్యార్థినికి మాత్రమే వైద్యం అందించాలని సూచించారు. కొత్తగా పేషెంట్లను పరీక్షించడం గాని, చేర్చుకోవడం గాని వద్దని ఆదేశించారు. ఈ ఘటనపై నిందితులపై కేసులు నమోదు కాలేదు. విచారణ కమిటీ నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటారని తెలిసింది. ఆస్పత్రి వద్ద మోటారు సైకిళ్లు వదిలేసి విద్యార్థిని ప్రియుడు, అతని స్నేహితులు పరారయ్యారు. ఇక్కడి ప్రైవేటు ఆస్పత్రి నిర్వహణను ప్రభుత్వ వైద్యాధికారిణి పర్యవేక్షిస్తున్న తీరును విచారణ కమిటీ తప్పు పడుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement