నిడదవోలు: పెట్రోలు, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ నిడదవోలు రైల్వే స్టేషన్ వద్ద ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యాన ఆటో కార్మికులు గురువారం ఆందోళన నిర్వహించారు. ఉన్నత విద్య అభ్యసించి కూడా ఉద్యోగాలు దొరక్క, అప్పులు చేసి మరీ ఆటోల ద్వారా ఉపాధి పొందుతున్నామని, ఇంధన ధరల పెంపుతో తమ జీవనోపాధి కుదేలైందని ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులు గెడ్డం రవీంద్రబాబు, ఈమని గ్రీష్మకుమార్ మాట్లాడుతూ, ఒకే దేశం, ఒకే పన్ను అంటూ కేంద్రంలోని మోదీ, అమిత్‌షాల ప్రభుత్వం పెట్రోలు, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకుని రావడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా అదనపు పన్ను వసూలు చేసుకునే వెసులుబాటు కల్పించడం ద్వారా ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని అన్నారు. తద్వారా అన్ని రకాల నిత్యావసర సరకుల ధరలు పెరిగేందుకు దొడ్డి దారిన అవకాశం కల్పిస్తూ పేదల పొట్ట కొడుతున్నారని విమర్శించారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బహిరంగ సభల్లో పెట్రో ధరలు పెంచబోమని మాయమాలు చెప్పిన కూటమి నేతలు.. ధరలు తగ్గిస్తామని మేనిఫెస్టోలో పెట్టిన సంగతి మరిచారని, కేంద్రం ఇష్టారాజ్యంగా పెట్రో ధరలు పెంచుతుంటే వంత పాడుతున్నారని దుయ్యబట్టారు. తక్షణమే రాష్ట్ర పన్ను వాటాలోనైనా రవాణా రంగ కార్మికులకు మినహాయింపునివ్వాలని డిమాండ్ చేశారు.


