పట్టపగలే సంచోరిస్తూ.. | - | Sakshi
Sakshi News home page

పట్టపగలే సంచోరిస్తూ..

May 29 2026 10:14 AM | Updated on May 29 2026 10:14 AM

అదును చూసి దొంగతనాలు

నిందితుడిని పట్టుకున్న

సర్పవరం పోలీసులు

కాకినాడ రూరల్‌: పట్టపగలే దొరలా వస్తాడు.. అదును చూసి దోచుకుపోతాడు.. ఇలా కొన్నేళ్లుగా పట్టపగలే చోరీలకు పాల్పడుతూ పోలీసులకు చుక్కలు చూపించాడు. చివరికి కటకటాల పాలయ్యాడు. దీనికి సంబంధించిన వివరాలను గురువారం సర్పవరం పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడిషనల్‌ ఎస్పీ పాటిల్‌ దేవరాజ్‌ మనీష్‌ వెల్లడించారు. సర్పవరం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 2024, 2025, 2026లో ఆరు పగటి పూట చోరీ కేసులు నమోదయ్యాయి. ఇందులో నిందితుడు కాకినాడ అర్బన్‌ రేచర్లపేట బర్మాకాలనీకి చెందిన ములపర్తి దుర్గాప్రసాద్‌ (నాని) అనే ప్రసాద్‌ను సర్పవరం పోలీసులు ఆర్టీఓ కార్యాలయం రోడ్డులోని కోటయ్య కన్వెన్షన్‌ హాలు వద్ద గురువారం మధ్యాహ్నం అరెస్ట్‌ చేశారు. నిందితుడి నుంచి రూ.32 లక్షల విలువైన 225 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు దొంగతనానికి ఉపయోగించిన బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అడిషనల్‌ ఎస్పీ మాట్లాడుతూ తాళాలు వేసిన ఇళ్లను గుర్తించి నిందితుడు దొంగతనాలకు పాల్పడుతున్నాడన్నారు. మూడేళ్లుగా దొంగతనాలకు పాల్పడతుండగా పోలీసులకు మాత్రం చిక్కడం ఇదే మొదటి సారి అన్నారు. ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తాళాలు బయటకు కనపడేలా వేయరాదని, ఇళ్లకు ఇన్నర్‌ లాకింగ్‌ సిస్టమ్‌ పెట్టుకోవాలన్నారు. లాక్‌డ్‌ హౌస్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ (ఎల్‌హెచ్‌ఎంఎస్‌) అనే పోలీస్‌ అప్లికేషన్‌ను గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు యాప్‌లో రిక్వెస్ట్‌ పెట్టడం ద్వారా ఉచిత పోలీసు సర్వీస్‌ను ఉపయోగించుకుని, నేరాలు జరగకుండా చూసుకోవాలని అన్నారు. సర్పవరం సీఐ సీహెచ్‌ ప్రకాష్‌, ఎస్సై ఏసుబాబు, క్రైం ఎస్సై వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement