వ్యర్థంతో అర్థం | - | Sakshi
Sakshi News home page

వ్యర్థంతో అర్థం

May 28 2026 12:22 AM | Updated on May 28 2026 12:22 AM

వక్క చెట్టు (పోక చెట్టు)జిల్లాలో 200 ఎకరాలు సాగు అవుతుండగా ఆకులను రైతులు వ్యర్థాలుగా వదిలేస్తున్నారు. వీటిని సేంద్రియ ఎరువుగా తయారు చేయడంతోపాటు రకాల వస్తువులను తయారు చేస్తే రైతులు అదనపు ఆదాయం పొందే అవకాశముంది. దళసరిగా, బలంగా ఉండే ఈ ఆకుతో ఆహారం తినే ప్లేట్లు, బౌల్స్‌ తయారీకి ఉపయోగిస్తున్నారు. ఇది పూర్తిగా పర్యావరణానికి అనుకూలమైంది. వీటిని వాడటం ద్వారా ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించి కాలుష్యాన్ని నివారించే అవకాశముంది. ఈ ఆకులతో తయారు చేసిన ప్లేట్లలో రసాయనాలు ఉండవు. వేడి ఆహారాన్ని కూడా ఈ ఆకుల ప్లేట్లలో వడ్డించడం ఆరోగ్యానికి సురక్షితం. వక్క ఆకులతో పర్యావరణ అనుకూలమైన ప్లేట్లు, గిన్నెలు తయారు చేసే పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇప్పటికే అనకాపల్లి వంటి జిల్లాలో ఇటువంటి పరిశ్రమలను ఏర్పాటు చేశారు. కాని జిల్లాలో సుమారు మూడు వేల ఎకరాల్లో వక్క సాగు జరుగుతున్నా ఇటువంటి పరిశ్రమలను మాత్రం ఏర్పాటు చేయలేదు.

ఐ.పోలవరం: వ్యవసాయ వ్యర్థాలను అర్థవంతంగా వినియోగిస్తే మేలైన ఉత్పత్తులను తయారు చేసే అవకాశముంది. వ్యవసాయ ఆధారిత కోనసీమ జిల్లాలో ఆ దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చాలా తక్కువే అని చెప్పాలి. కొబ్బరి డొక్కతో తప్ప మిగిలిన వ్యవసాయ వ్యర్థాలను వినియోగిస్తున్న దాఖలాలు లేవు. ఇటువంటి వాటితో మహిళా స్వయం శక్తి సంఘాలు, రైతు సంఘాలు, నిరుద్యోగ యువతతో చిన్నచిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసే అవకాశమున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

తూడు, గుర్రపుడెక్కతో..

గోదావరి డెల్టా రైతులను కడగండ్లు పాల్జేసే తూడు, గుర్రపు డెక్కతో పలు రకాల ఉత్పత్తులను తయారు చేసే అవకాశముంది. ఇది వ్యవసాయ వ్యర్థం కాకున్నా జిల్లాలో వ్యవసాయానికి ప్రధాన అవరోధంగా మారిన విషయం తెలిసిందే. తూడు, గుర్రపు డెక్క ఇటు రైతులను, అటు ఇరిగేషన్‌ అధికారులను దశాబ్దాల కాలం పాటు ముప్పుతిప్పలు పెడుతున్న కలుపు మొక్కలు. కాలువల్లో టన్నుల కొద్దీ లభిస్తోంది. వీటి వల్ల జరుగుతున్న నష్టం భరించలేక రైతులు ఏటా ఐదు వేల ఎకరాల్లో వరిసాగునే వదిలేందుకు సిద్ధమవుతున్నారు. గోదావరి డెల్టా పరిధిలో పంట కాలువలు, మురుగునీటి కాలువల్లో పేరుకుపోతున్న వీటిని తొలగించేందుకు ప్రభుత్వం ఏటా కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది.

● గుర్రపుడెక్కతో తయారు చేసే కంపోస్టులో పోషకాలు మెండు. కుళ్లిన గుర్రపుడెక్కను సేంద్రియ ఎరువుగా తయారు చేస్తే దానిలో సేంద్రియ కర్భనం 60 శాతం, సల్వమోతాదులో నత్రజని 2.5 శాతం, భాస్వరం 1.8 శాతం, పొటాషియం 4 శాతం ఉంటుంది. వీటితోపాటు మాలిడియన్‌, మెగ్నీషియం వంటి అరుదైన పోషకాలు ఉంటాయి. ఇది కొబ్బరి పొట్టుతో సమానంగా నీటి నిల్వను చేసి మొక్కకు అందజేస్తోంది. వరి చేలల్లో మిగిలిన పోషకాలు డ్రెయిన్లలో వెళ్లిన తరువాత గుర్రపుడెక్క ఎక్కువగా స్వీకరిస్తోంది. కంపోస్టుగా తయారు చేసి వినియోగిస్తే చేలల్లో నష్టపోయిన పోషకాలు చెట్లకు అందుతాయి. పంచాయతీలలో నిర్మించిన చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలు ఖాళీగా ఉన్నాయి. రైతు సంఘాలు, మహిళా స్వయం శక్తి సంఘాలతో వీటిని ఉత్పత్తి చేయవచ్చు.

● గుర్రపు డెక్క నార తీసి చేతి సంచులు, బుట్టలు, ఇతర గృహోపకర అలంకార వస్తువులు తయారు చేసే అవకాశముంది. కృష్ణ, గుంటూరు జిల్లాలో డ్వాక్రా సంఘాలు వీటిని ప్రయోగాత్మకంగా తయారు చేస్తున్నాయి. ఇటువంటి వాటిని ఇక్కడ కూడా స్వయం శక్తి సంఘాల ద్వారా తయారు చేయించే అవకాశముంది.

వ్యవసాయ వ్యర్థాలను

సొమ్ము చేసుకోవచ్చు

గుర్రపు డెక్క, తూడుతో సేంద్రియ ఎరువు

నారతో అలంకరణ వస్తువులు

అరటి నార, పోక ఆకులతో

పలు ఉత్పత్తులు

అరటి బొందలతో..

జిల్లాలో అరటి 15వేల ఎకరాల్లో పెద్ద ఎత్తున సాగవుతున్న విషయం తెలిసిందే. కొత్తపేట, పి.గన్నవరం నియోజకవర్గాలతోపాటు రాజోలు, మామిడికుదురు, ముమ్మిడివరం మండలాల్లో ఈ సాగు అధికం. అరటి గెలల సేకరణ తరువాత బొందలు, ఆకులను రైతులు వదిలేస్తున్నారు. వీటిని వినియోగించి సేంద్రియ ఎరువు తయారు చేయడంతోపాటు అరటి ఆకుల ఆహారాన్ని వడ్డించే కంచాలు, ప్లేటులుగా తయారు చేయవచ్చు. అరటి బొందల నుంచి నారను సేకరించి వీటితో కూడా గృహోపకరణ వస్తువులు తయారు చేస్తున్నారు. జిల్లాలో గతంలో అరటి నారతో ఉత్పత్తుల తయారీకి పలు ప్రయోగాలు జరిగినా ఫలితం ఇవ్వలేదు. అంబాజీపేట మండలం ముక్కామల, రావులపాలెంలో ఈ ప్రయత్నాలు చేశారు. కానీ ప్రభుత్వం నుంచి పెద్దగా ప్రోత్సాహం లేకుండా ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement