ద్వారకాతిరుమల: రాష్ట్రంలో పెద్ద తిరుపతిలో మాత్రమే ఉన్న శాశ్వత క్యూ కాంప్లెక్స్‌ను.. ఇప్పుడు చిన్నతిరుపతిలో నిర్మించి, భక్తులకు అందుబాటులోకి తెచ్చినట్టు ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. శ్రీవారి క్షేత్రంలో రూ.12.50 కోట్లతో నూతనంగా నిర్మించిన క్యూ కాంప్లెక్స్‌ను బుధవారం నుంచి భక్తులకు అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్భంగా నూతన అనివెట్టి మండపంలో ఈఓ త్రినాథరావు, ఈఈ డీవీ భాస్కర్, ప్రధానార్చకులు పీవీఎస్‌ఎస్‌ఆర్ జగన్నాథాచార్యులతో కలసి విలేకరులతో మాట్లాడారు. పెద్ద తిరుపతిలో మినహా ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏ దేవాలయంలోనూ శాశ్వత క్యూ కాంప్లెక్స్ లేదన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించాలన్న లక్ష్యంతో ఈ క్యూ కాంప్లెక్స్‌ను నిర్మించామన్నారు. ట్రైల్ రన్ వేసిన తరువాతే ఈ క్యూ కాంప్లెక్స్‌ను ప్రారంభించినట్టు చెప్పారు. గతంలో నిర్మించిన తాత్కాలిక క్యూ కాంప్లెక్స్ 3 వేల మంది భక్తులకు సరిపోయేదని, ఈ శాశ్వత క్యూ కాంప్లెక్స్‌లో ఒకేసారి 4,500 మంది భక్తులు కూర్చోవచ్చన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వాడేందుకు ఎగ్జిట్ గేట్లు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. భక్తులకు నిరంతరాయంగా మంచినీటిని అందిస్తున్నామన్నారు. భక్తులు శ్రీవారి దర్శనానంతరం తిరిగి బయటకు వెళ్లి, అక్కడ ఉచిత ప్రసాదాన్ని అందుకుంటున్నారని అన్నారు.
శాస్త్రబద్ధంగానే ఏర్పాట్లు..
నూతన వైకుంఠం క్యూ కాంప్లెక్స్, ఇతర కట్టడాలు, దర్శన ఏర్పాట్లు పూర్వ ఆచారాలు, సనాతన సంప్రదాయాల ప్రకారమే జరిగాయని ఆలయ ప్రధానార్చకులు జగన్నాథాచార్యులు తెలిపారు. స్వామివారిని ఎదురుగా దర్శించుకోవాలన్న కోరికను గతంలో భక్తులు తన వద్ద వ్యక్తపరిచారని ఇప్పుడు అది సాకారమైందని తెలిపారు.
ఈఓ వేండ్ర త్రినాథరావు


