రాజమహేంద్రవరం రూరల్: 2027 గోదావరి పుష్కరాల నిర్వహణకు రోడ్ మ్యాప్ సిద్ధమైందని, ప్లాస్టిక్ రహితంగా పుష్కరాలను నిర్వహిస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. బుధవారం హుకుంపేటలోని ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గోదావరి కాలుష్య నివారణకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌ను నోడల్ ఏజెన్సీగా చేస్తూ, వివిధ శాఖల అధికారులతో కూడిన ’స్పెషల్ టాస్క్ ఫోర్స్’ను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఈ ఉదయమే జీవో విడుదలయిందన్నారు. త్వరలో ’పొల్యూషన్ ఆడిట్’ నిర్వహిస్తామని చెప్పారు. ‘ఎఫ్ లెంట్ ట్రీట్‌మెంట్ చేసే గోదావరిలోకి నీళ్లు వదులుతున్నామని ఆంధ్రా పేపర్ మిల్లు వారు మాకు దొంగమాటలు చెబుతున్నారు. నిన్న డిప్యూటీ సీఎం, నేను కళ్లారా చూసి నీటి గాఢతను చెక్ చేస్తే పీహెచ్ విలువ 7 కంటే ఎక్కువగా ఉంది. లాభాలు పొందుతూ కార్మికులకు కనీసం వేతనాలు ఇవ్వరు‘ అని పేపర్ మిల్లు యాజమాన్యంపై మంత్రి ఫైర్ అయ్యారు. మున్సిపాలిటీకి ఆంధ్రా పేపర్ మిల్లు రూ.13 కోట్ల బకాయిలను నేటికీ కట్టలేదని, ఇకపై ఉపేక్షించే ప్రసక్తి లేదని వార్నింగ్ ఇచ్చారు. పరిశ్రమలు, ఇతరులు మురుగును నేరుగా నదిలోకి వదిలితే ఇకపై నేరుగా జైలుకు పంపుతామన్నారు.
రూ. 8,500 కోట్లతో ప్రణాళిక
పుష్కరాలు జరిగే 6 జిల్లాల పరిధిలో దాదాపు రూ.8,500 కోట్లతో ప్రతిపాదనలను సిద్ధం చేశామన్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న విజ్జేశ్వరం – సిద్ధాంతం ఏటిగట్టు రహదారి (33 కి.మీ) అభివద్ధికి రూ. 66 కోట్లతో డిప్యూటీ సీఎంకు ప్రతిపాదనలు ఇచ్చామని మంత్రి తెలిపారు. సినిమా పరిశ్రమ అభివృద్ధికి డిప్యూటీ సీఎం ఇచ్చిన సలహాలను పాటిస్తామని మంత్రి దుర్గేష్ తెలిపారు.
మంత్రి దుర్గేష్


