వడదెబ్బకు ఉపాధి కూలీ మృతి | - | Sakshi
Sakshi News home page

వడదెబ్బకు ఉపాధి కూలీ మృతి

May 28 2026 12:22 AM | Updated on May 28 2026 12:22 AM

పి.గన్నవరం: మండలంలోని వై.కొత్తపల్లి గ్రామానికి చెందిన రామేశ్వరపు వెంకటేశ్వరరావు (68) ఉపాధి పని చేస్తుండగా వడగాడ్పులకు తట్టుకోలేక మృతి చెందాడు. గ్రామంలో మంగళవారం ఉపాధి పథకం పనులు చేస్తుండగా ఎండ తీవ్రతకు అతడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీంతో అతడిని సహచర కూలీలు పి.గన్నవరం సీహెచ్‌సీకి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి అమలాపురం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అర్థరాత్రి మృతి చెందాడు.

రైలు ఢీకొని వ్యక్తి..

నిడదవోలు: స్థానిక రైల్వే ఓవర్‌ బ్రిడ్జి సమీపంలోని రైల్వే ట్రాక్‌ వద్ద బుధవారం సుమారు 40 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి రైలు ఢీకొని మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. రైల్వే ట్రాక్‌ వెంబడి నడచి వస్తుండగా రాజమహేంద్రవరం నుంచి విజయవాడవైపు వెళ్తున్న రైలు ఢీకొని అతడు మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుడు 5.5 అడుగుల ఎత్తు, చామన ఛాయలో ఉన్నాడు. నలుపు రంగు జీన్స్‌ ప్యాంటు, తెలుపు, నలుపు రంగుల చొక్కా ధరించి ఉన్నాడు. తాడేపల్లిగూడెం రైల్వే హెస్‌సీ డి.వెంకటేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

శబరిలో మునిగి మహిళ..

చింతూరు: మతి స్థిమితం లేని మహిళ స్థానిక శబరినదిలో మునిగి మృతిచెందిన సంఘటన మండలం చట్టిలో చోటు చేసుకుంది. ఆ గ్రామానికి చెందిన లాడె కుమారి (55) మతి స్థిమితం లేకపోవడంతో పాటు క్షయవ్యాధితో బాధపడుతోంది. బుధవారం ఉదయం చింతూరు, వీఆర్‌ పురం ప్రధాన రహదారిలోని ఎయిర్‌టెల్‌ టవర్‌ వద్ద శబరినదిలో ఆమె మృతదేహం లభ్యమైంది. పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. స్నానానికి వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు నదిలో పడి మృతి చెంది ఉండవచ్చని, కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సంతోష్‌కుమార్‌ తెలిపారు.

పాముకాటుకు గురై..

రాజానగరం: మండలంలోని తూర్పుగానుగూడేనికి చెందిన సిద్దాబత్తుల ధనలక్ష్మి (60) పాము కాటుకు గురై మృతి చెందింది. ఉపాధి కూలీ పనులు చేస్తూ జీవించే ఆమె మంగళవారం రాత్రి ఇంటి వద్ద బాత్‌రూంలో స్నానం చేసి ఇంట్లోకి వెళ్తున్న సమయంలో పాము కాటు వేసింది. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు వచ్చిన 108 వాహనంలో ఆమెను రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్టు తూర్పు గానుగూడెం క్రైస్తవ సంఘ ప్రతినిధి జి.సుందరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ధనలక్ష్మికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement