కోళ్లుకోలేని వడదెబ్బ | - | Sakshi
Sakshi News home page

కోళ్లుకోలేని వడదెబ్బ

May 27 2026 12:17 AM | Updated on May 27 2026 12:17 AM

పెరవలి: వేసవి తాపానికి ప్రజలతో పాటు కోళ్లు కూడా గుడ్లు తేలేస్తున్నాయి. జిల్లాలో ప్రతి రోజూ 10 వేల కోళ్లు మృత్యువాతకు గురవుతున్నాయని పౌల్ట్రీల యజమానులు గగ్గోలు పెడుతున్నారు. గత ఏడాది ఇదే సమయంలో బర్డ్‌ఫ్లూతో కోళ్ల పరిశ్రమ కుదేలైంది. ఇప్పడు అధిక ఉష్ణోగ్రతల వలన కోళ్లు మృత్యువాత పడటంతో యజమానులు భారీ నష్టాలు చవిచూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కోళ్ల ఫారాల నుంచి ఉత్పత్తి అవుతున్న గుడ్లకు గిట్టుబాటు ధర లభించకపోవటంతో మరింత ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. ఒకవైపు గుడ్లకు ధర లేక అల్లాడుతుంటే గోరుచుట్టుపై రోకటి పోటులా వడగాడ్పులకు కోళ్లు మృత్యువాత పడుతున్నాయని, మరోవైపు కోళ్ల మేత ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో కోళ్ల ఫారాలు ఇలా..

అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో 245 కోళ్ల ఫారాల్లో 1.50 కోట్ల కోళ్లను పెంచుతున్నారు. ఇవన్నీ 50 వేలకు పైగా ఫారాలు. ఇవే కాకుండా 5వేల నుంచి 40 వేల సామర్థ్యం గల కోళ్ల ఫారాలు ఉన్నాయి. వీటిలో మరో కోటి కోళ్లను పెంచుతున్నారు. జిల్లాలో ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలోనే 70 లక్షల కోళ్లు, నిడదవోలు నియోజకవర్గంలో 50 లక్షల కోళ్లు, నల్లజర్ల, గోపాలపురం, కొవ్వూరు, కడియం నియోజకవర్గాల్లో మరో 30 లక్షల కోళ్ల పెంపకం జరుగుతున్నది.

ఉత్పత్తి ఉన్నా తీవ్ర నష్టాలు

జిల్లాలో కోడిగుడ్ల ఉత్పత్తి రోజుకి 60 లక్షలకు పడిపోయింది. అధిక ఉష్ణోగ్రతల వల్ల మేతలు తినక ఎండ వేడి తట్టుకోలేక కోళ్లు మృత్యుబారిన పడుతున్నాయి. ఇదిలా ఉంటే మరోవైపు గుడ్డు ధరలు ప్రస్తుతం (మంగళవారం) రూ.5.30 పైసలు ఉండటంతో రైతులకు గిట్టుబాటు కావటం లేదు. ఫిబ్రవరి నెలలో ఈ ధర రూ.6.15 ఉంది. ఏప్రిల్‌ నెల నుంచి ధరల పతనం కొనసాగుతుండడంతో రైతులు నష్టాల పాలవుతున్నారు.

తగ్గని పిల్ల ధర, పెరిగిపోతున్న మేత ధరలు

ఎండల తీవ్రతకు కోళ్లు చనిపోతున్నా కోడిపిల్లల ధర మాత్రం రూ.50 తగ్గటం లేదు. దీంతో మృత్యువాత పడిన కోళ్ల స్థానంలో మరో బ్యాచ్‌ పెంచుదామంటే గుడ్డు ధరలు పెరగకపోగా, మరింత పతనమవ్వటంతో రైతులు ఆర్థికంగా నలిగిపోతున్నారు. ఇక మేత ధరలు కొండెక్కి కూర్చోవటంతో రైతులు ఉన్న కోళ్లను మేపలేక, పెరిగిన మేత ధరలకు తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు.

జిల్లాలో రోజుకి

10 వేల కోళ్లు మృత్యువాత

గగ్గోలు పెడుతున్న

పౌల్ట్రీల యజమానులు

పెరుగుతున్న మేత ధరలు

మేత (టన్నుల్లో) ధరలు (రూ.లలో)

మార్చిలో మే నెలలో

చేప 48వేలు 55 వేలు

మొక్కజొన్న 18వేలు 23 వేలు

నూకలు 20వేలు 22 వేలు

సోయా 40 వేలు 75 వేలు

తవుడు 15వేలు 20 వేలు

ఉత్పత్తి సగానికి పడిపోయింది

ఎండ దెబ్బకు కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. మరోవైపు గుడ్ల ఉత్పత్తి సగానికి సగం పడిపోయింది. దీనికి తగ్గట్టు మార్కెట్టులో గుడ్లకు ధరలు లేక ఇబ్బందులు పడుతున్నాం. ప్రతిరోజు వీటికి అయ్యే మేత ఖర్చులు, విద్యుత్‌ బిల్లులు, ఎండ వేడి సోకకుండా తీసుకున్న జాగ్రత్తలకు పెట్టుబడి తడిసి మోపెడు అవుతోంది.

– మండ తాతారెడ్డి, కోళ్లఫారం యజమాని, పిట్టల వేమవరం,

రూ.లక్షల్లో నష్టపోతున్నాం

ప్రస్తుతం మార్కెట్టులో గుడ్డు ధర రూ.5.30 ఉంది. ప్రస్తుత మేత ధరల ప్రకారం రూ.5.50 ధర ఉంటే గిట్టుబాటు అవుతుంది. అధిక ఉష్ణోగ్రతలు వలన కోళ్లు మృత్యువాత పడటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. గుడ్డు ధరలు పడిపోయి రూ.లక్షల్లో నష్టపోతున్నాం. ఏమి చెయ్యాలో తెలియటంలేదు.

– భూపతిరాజు వరహాలరాజు, రైతు, ఖండవల్లి

Advertisement
 
Advertisement
Advertisement