ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిది భారీ దోపిడీ | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిది భారీ దోపిడీ

May 27 2026 12:17 AM | Updated on May 27 2026 12:17 AM

అనపర్తి: స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి నేతృత్వంలోనే భారీ దోపిడీ జరుగుతుండటం వల్ల అధికారులు పట్టించుకోవడం లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. స్థానిక రామచంద్రుని చెరువును చూస్తుంటే సింగరేణి గనులను చూస్తున్నట్టు ఉందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రామచంద్రుని చెరువులో జరుగుతున్న అక్రమ మైనింగ్‌ ప్రాంతాన్ని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, రాజమహేంద్రవరం పార్లమెంటరీ సమన్వయకర్త డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌, అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి తదితరులు మంగళవారం పరిశీలించారు. జక్కంపూడి రాజా మాట్లాడుతూ రామచంద్రుని చెరువులో 50 అడుగుల లోతున తవ్వకాలు జరుపుతూ ప్రకృతి సంపదను దోచేస్తున్నారన్నారు.

జిల్లాలో పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించడానికి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పర్యావరణాన్ని కాపాడుతానని చెబుతున్న మాటలకు కట్టుబడి ఉంటే, ఇక్కడ జరుగుతున్న దోపిడీని చూడాలని సవాల్‌ విసిరారు. ప్రభుత్వం, అధికారులు దీనిపై స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. పెదపూడి మండలంలో రైతులు మెరక తీసే మట్టిని తరలించే క్రమంలో టిప్పర్‌లు ఎంపీ పురందరేశ్వరి కారుకు అడ్డు వచ్చాయని, దీంతో 7 టిప్పర్‌లను అదుపులోకి తీసుకుని ఉక్కుపాదం మోపుతాను అంటూ స్థానిక ఎమ్మెల్యే ప్రగల్భాలు పలుకుతున్నారని అదేదో అక్రమ మైనింగ్‌పై మోపాలన్నారు.

మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెరువుల్లో మట్టి, గ్రావెల్‌, ఇసుక దోపిడీ విపరీతంగా పెరిగిపోయిందని చెప్పారు. అనపర్తి నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ తవ్వకాల వెనుక కోట్లాది రూపాయల అవినీతి దాగి ఉందని ఆరోపించారు. ఇక్కడ కొన్నిచోట్ల 30నుంచి 50అడుగుల లోతు వరకు నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరిపారని పేర్కొన్నారు. ఈ అక్రమాలపై గతంలోనే ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి లేఖ రాసి, రికార్డు చేసిన వీడియోలు పెన్‌ డ్రైవ్‌ పంపితే ఆయన వ్యంగ్యంగా మాట్లాడారే తప్ప చర్యలు తీసుకోలేదని చెప్పారు. సాయంత్రం 6 గంటల తర్వాత మట్టి తీయడానికి వీల్లేదన్న నిబంధనను, 3 మీటర్ల లోతు పరిమితిని ఇక్కడ తుంగలో తొక్కారని ధ్వజమెత్తారు.

గతంలో రామకృష్ణారెడ్డి హయాంలో కాపవరం చెరువులో ముగ్గురు, రంగాపురంలో ఇద్దరు, రామచంద్రుని చెరువులో ఒక యువకుడు పశువులను కడగడానికి వెళ్లి లోతైన గుంతల వల్ల చనిపోయిన ఉదంతాలను ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు అంతకంటే నాలుగు రెట్లు ఎక్కువ లోతుగా తవ్వుతున్నారని అన్నారు. అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఒక అవినీతి కొండలా మారారని, పక్కనే ఆఫీస్‌ ఉన్నా రూ.కోట్లలో ముడుపుల కోసమే ఇక్కడికి రావడం లేదని ఆరోపించారు. నాయకులు ఇక్కడికి వచ్చి రీల్స్‌ చేసుకుని వెళ్తున్నారంటూ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతూ, ఇది రీల్స్‌ కాదని, రియాలిటీ అని, ధైర్యముంటే ఎమ్మెల్యే కూడా వచ్చి ఇక్కడి యదార్థాన్ని చూడాలని సవాల్‌ విసిరారు.

డీఆర్‌వోకు ఫిర్యాదు

రామచంద్రుని చెరువులో అక్రమ మైనింగ్‌ పై చర్యలు కోరుతూ పార్టీ నాయకులు మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తికి వినతి పత్రం అందజేశారు. పార్టీ మండల కన్వీనర్‌ సత్తి రామకృష్ణారెడ్డి(రాంబాబు), జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ళ కృష్ణారెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు కొండేటి భీమేష్‌, రాజానగరం నియోజకవర్గ పరిశీలకులు తోట రామకృష్ణ, పార్టీ మహిళా ప్రధాన కార్యదర్శి అంగాడ సత్యప్రియ, టాస్క్‌ఫోర్స్‌ జిల్లా ఇన్‌చార్జీ వామిశెట్టి పరమేశ్వరరావు పాల్గొన్నారు.

సింగరేణి గనులను తలపిస్తున్న

రామచంద్రుని చెరువు

వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం

అధ్యక్షుడు జక్కంపూడి రాజా

క్షేత్రస్థాయిలో పరిశీలించిన నేతలు

Advertisement
 
Advertisement
Advertisement