బేలెన్స్‌ చేసేదెలా! | - | Sakshi
Sakshi News home page

బేలెన్స్‌ చేసేదెలా!

May 27 2026 12:17 AM | Updated on May 27 2026 9:51 AM

-

సహకార సంఘాల్లో ఇంబేలెన్స్‌ సమస్య

డీసీసీబీ ఆందోళన

పొదుపు పాటించాలని సూచన

షేర్‌ ధనం జమ చేయకపోవడమే కారణమని సంఘాల వాదన

అమలాపురం టౌన్‌: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిఽధిలోని 298 సహకార సంఘాలకు గాను 130 సంఘాల్లో సుమారు రూ.400 కోట్ల మేర ఇంబేలెన్స్‌ (అసమతుల్యత) ఏర్పడింది. దీని వల్ల సంఘాల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటోందని, బ్యాంక్‌ రికవరీలు, లిక్విడిటీ, వ్యాపార కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పడుతోందని డీసీసీబీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇదే సమయంలో సహకార సంఘాలు కూడా తమ వాదన వినిపిస్తున్నాయి.

సంఘాల వద్ద రైతులు రుణాలు తీసుకునేటప్పుడు వారి నుంచి వసూలు చేసే షేర్‌ ధనం (క్యాపిటల్‌) డీసీసీబీకే చెల్లించేస్తున్నామని, ఆ షేర్‌ ధనాన్ని తమకు బ్యాంక్‌ ఇచ్చిన రుణాలకు జమ చేసుకోకపోవడం వల్లే ఇంబాలెన్స్‌ సమస్య తలెత్తుతోందని చెబుతున్నాయి. అయితే ఈ విషయాన్ని డీసీసీబీ పూర్తిగా కొట్టి పారేస్తోంది. సంఘాలు ఇటీవల కాలంలో పెరిగిన ఖర్చులను తగ్గించుకుంటే మంచిదని సూచిస్తోంది.

షేర్‌ ధనం అంటే..
ఉదాహరణకు సంఘంలో ఒక రైతు రూ.లక్ష అప్పు తీసుకుంటే షేర్‌ ధనం కింద రూ.10 వేలను అప్పుడే డీసీసీబీకి చెల్లించి వేస్తున్నామని సంఘాల సీఈవోలు చెబుతున్నారు. అదే రైతు అప్పును క్లోజ్‌ చేస్తున్నప్పుడు, ముందుచ్చిన షేర్‌ ధనం రూ.10 వేల తగ్గించి మిగిలిన రూ.90 వేలు చెల్లిస్తున్నాడు. అలా ఆ 10 వేలు డీసీసీబీ వద్దే ఉండిపోతున్నాయి. ఆ లెక్కన ఇప్పుడు ఇంబాలెన్స్‌గా ఉన్న 130 సంఘాలకు చెందిన కోట్లాది రూపాయల షేర్‌ ధనం డీసీసీబీ వద్దే నిల్వ ఉండిపోతోంది.

ఆ షేర్‌ ధనం నిల్వలు తమకే చెందుతాయని, అయితే తాము దానిపై వచ్చే వడ్డీ నష్టపోతున్నామని సంఘాలు చెబుతున్నాయి. ప్రస్తుతం డీసీసీబీ, సంఘాల మధ్య ఇప్పుడు షేర్‌ ధనం చిచ్చు రగులుతోంది. షేర్‌ ధనం డీసీసీబీ వద్ద నిల్వ ఉండడం వల్లే సంఘాలు ఇంబాలెన్స్‌కు గురవుతున్నాయే తప్ప మేము చేసే ఖర్చుల వల్ల కాదని సంఘాల సీఈవోలు, త్రీమెన్‌ కమిటీల ప్రతినిధులు చెబుతున్నారు.

డీసీసీబీ పొదుపు మంత్రం
సంఘాలు ఇంబాలెన్స్‌ క్రమంగా తగ్గించుకునేందుకు, భవిష్యత్తులో అది మరింత పెరగకుండా నివారించేందుకు డీసీసీబీ కొన్ని సూచనలు చేసింది. ఆ ప్రకారం.. సంఘాల సభ్యులైన రైతులకు మంజూరు చేసిన అప్పులపై వడ్డీని సక్రమంగా లెక్కకట్టి వసూలు చేయాలి. నిబంధనలకు విరుద్ధంగా సిబ్బంది జీత భత్యాలు, ఇతర భత్యాలు (ఎలవన్స్‌లు) పెంచకూడదు. డిస్ట్రిక్ట్‌ లెవెల్‌ ఎన్‌పవర్‌ కమిటీ (డీఎల్‌ఈసీ) అనుమతి లేకుండా సంఘాల్లో శాశ్వత లేదా తాత్కాలిక ప్రాతిపదికన పోస్టులు నియామకాలు చేపట్టకూడదు.

గత ఆర్థిక సంవత్సరం ఖర్చులతో పోల్చి కనీసం 25 శాతం ఖర్చులను తగ్గించుకుని సంఘాల నిర్వహణ చేయాలి. సభ్యుల నుంచి డిపాజిట్లు సేకరించి బ్యాంక్‌లో డిపాజిట్‌ చేయడం ద్వారా మార్జిన్‌ వడ్డీ పొందడం, సభ్యుల డిపాజిట్లపై సొంత వ్యాపారాలు నిర్వహిస్తూ సంఘాల ద్వారా అప్పులు మంజూరు చేసి సక్రమంగా వసూలు చేసి లాభాలు ఆర్జించాలి. ఇలా మొత్తం 18 పొదుపు సూత్రాలను డీసీసీబీ సహకార సంఘాలకు సూచిస్తూ ఆంక్షలు విధించింది.

ఖర్చులు తగ్గించుకోవాలి
ప్రభుత్వ నిబంధనలకు లోబడి సహకార సంఘాలు ఖర్చులను తగ్గించుకోవాలి. అప్పుడే ఇంబాలెన్స్‌ సమస్యలన్నీ తీరుతాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని వ్యవసాయ సహకార సంఘాలు డీసీసీబీ నుంచి తీసుకున్న రుణాన్ని రైతుల నుంచి సక్రమంగా వసూలు చేసుకోవాలి. అప్పుడే డీసీసీబీకి, పీఏసీఎస్‌లకు ఆర్ధిక స్థితిగతులు బాగుంటాయి. - సీఈవో, డీసీసీబీ, కాకినాడ

Advertisement
 
Advertisement
Advertisement