అల్లవరం: మండలంలోని ఓడలరేవు, కొమరగిరిపట్నం సముద్ర తీర ప్రాంతాల్లో అక్రమంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలపై రెవెన్యూ యంత్రాంగం స్పందించింది. పలు పత్రికల్లో వచ్చిన కథనాలకు జిల్లా కలెక్టర్ స్పందించి క్షేత్ర స్థాయిలో ఇసుక తవ్వకాలపై నివేదిక ఇవ్వాలని అల్లవరం తహసీల్దార్ వీవీఎల్ నరసింహారావును ఆదేశించారు. దీంతో రెవెన్యూ, పోలీసు, మత్స్యశాఖల అధికారులు సంయుక్తంగా సోమవారం క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. సర్వే నెంబర్లు 1037, 1033 పొలాల్లో ఇసుక తవ్వకాలు నిలిపివేసినట్లుగా అధికారులు నివేదిక ఇచ్చే ప్రయత్నం చేశారని ఆరోపణలు వస్తున్నాయి. నేటికి ఓడలరేవులో టీడీపీ నాయకుడు నిర్వహిస్తున్న ఇసుక తవ్వకాలపై రెవెన్యూ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదో వివరణ ఇవ్వాలని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. అక్రమ ఇసుక దందాకు రెవెన్యూ అధికారులు కనుసన్నలో జరుగుతుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తహసీల్దార్ వెంట ఎస్సై సంపత్‌కుమార్, వీఆర్‌ఓ సతీష్ పాల్గొన్నారు.


