ఎట్టకేలకు పూర్తయిన లైడార్ సర్వే
గోదావరి డెల్టాలో నీటి మట్టం లెవెల్స్ గుర్తించేందుకు ఉమ్మడి గోదావరి జిల్లాలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతాంగం పట్టుబట్టడంతో ఎట్టకేలకు ప్రభుత్వం లైడార్ సర్వేకు ఉపక్రమించింది. గత నెల రోజులుగా విశాఖపట్నం కేంద్రంగా రూ.13 కోట్లతో విమానం సాయంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సర్వే పూర్తి చేశారు. పశ్చిమ, తూర్పు డెల్టాల రిపోర్టు సిద్ధం కాగా, సెంట్రల్ రిపోర్టు తయారవుతోంది. త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే అవకాశం ఉంది.
లైడార్ సర్వేతో ప్రయోజనం ఏమిటంటే...
భూమి కుంగిందా లేదా అనే వాస్తవం పక్కన పెడితే డెల్టాను ఉప్పునీరు ముంచెత్తుతోందనే మరో వాస్తవం లైడార్ సర్వేతో కళ్లకు కనిపిస్తోంది. పంట చేలు చనిపోవడం, రైతాంగం నష్టపోవడం కూడా కళ్లకు కనిపిస్తోంది. కాటన్ కాలం నాటి లెవెల్స్, స్ట్రక్చర్ల సామర్థ్యం వంటి వాటితో పాటు లైడార్ ద్వారా సముద్ర నీటి మట్టం పెరగడం వల్ల డ్రెయిన్లు, నదుల్లోకి ఎంత మేరకు ఉప్పునీటి ప్రవాహం పెరిగింది.. పంట కాలువల్లోకి కూడా ఈ ఉప్పునీటి ప్రవాహం ఏ మేరకు చేరిందనే అంచనాలు లైడార్ సర్వేతో తేలుతాయి.
ఆధునికీకరణలో భాగంగా ఏం చేస్తారంటే...
లైడార్ సర్వే పూర్తి కావస్తోన్నందున ఆధునికీకరణ పనుల్లో భాగంగా సముద్ర తీరంలోని డ్రెయిన్లు, పంట కాలువల గట్లును ఎత్తు చేస్తారు. లేనిచోట్ల కొత్తగా గట్లు నిర్మిస్తారు. ఆయా డ్రెయిన్లు గోదావరి, సముద్రంలో కలిసే ప్రాంతాల్లో రెగ్యులేటర్లు నిర్మిస్తారు. ఇక్కడ ప్రధానంగా ప్రవహించే శంకరగప్తం, కూనవరం వంటి మేజర్ డ్రెయిన్లకు ఈ రెగ్యులేటర్ల ఆవశ్యకత ఉంది. ఇప్పటికే డెల్టా పరిధిలోని పశ్చిమ గోదావరి జిల్లాలో నల్లి క్రీక్, కోనసీమలోని శంకరగుప్తం డ్రెయిన్ల పూడికతీత, గట్టు పటిష్ట పనులు చేపట్టారు. అయితే నిధుల విడుదలలో చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర తాత్సారం చేస్తోంది.
నాటి సీఎం వైఎస్సార్ ఆధునికీకరణ
ఫైల్ బయటకు..
గోదావరి డెల్టాలో ఈనాటి దుస్థితిని ఆనాడే గుర్తించిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ధవళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో గోదావరి డెల్టాను ఆధునికీకరించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆయన హయాంలోనే రూ.3,500 కోట్లతో పనులు కూడా ప్రారంభించారు. దురదృష్టవశాత్తూ వైఎస్సార్ మరణానంతరం అధికారం చేపట్టిన అప్పటి కాంగ్రెస్, కూటమి ప్రభుత్వాలు ఆ పనులను అర్ధాంతరంగా వదిలేశాయి. పరిస్థితి నానాటికీ దిగజారడంతో ప్రస్తుత కూటమి ప్రభుత్వం కళ్లు తెరుస్తోంది. లైడార్ సర్వే లేకుండానే వాస్తవాన్ని అప్పటి సీఎం రాజశేఖరరెడ్డి గుర్తిస్తే... ప్రస్తుత కూటమి ప్రభుత్వం రూ.13 కోట్లతో ఏకంగా విమానాల సాయంతో లైడార్ సర్వే చేస్తేనే గానీ తీర గ్రామాలపై ఉప్పునీటి పంజాను గుర్తించకపోవడం గమనార్హం.
చంద్రబాబు ప్రభుత్వం నిధులిచ్చేనా?
చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లనా ఇరిగేషన్ పనుల జోలికి వెళ్లడం లేదు. ఇప్పటి వరకు చేసిన అరకొర పనులకు బిల్లులు కూడా చెల్లించలేదు. ఇటువంటి సరిస్థితుల్లో ఆధునికీకరణ పనులు ఎలా చేస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. 2006లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రూపొందించిన అంచనాల ప్రకారం గోదావరి డెల్టా ఆధునికీకరణకు అప్పట్లోనే రూ.3,500 కోట్లు అంచనా వేశారు. ప్రస్తుతం 20 ఏళ్ల తర్వాత ఆ ఫైల్‌ను కూటమి సర్కారు బయటకుతీసి రీ ఎస్టిమేట్ వేస్తోంది. ఈ నేపథ్యంలో అత్యంత ప్రాధాన్యత పనులు చేపట్టాలన్నా పెరిగిన ధరలు, కొత్త ప్రతిపాదనలు చేర్చడం వల్ల రూ.10 వేల కోట్లు అవసరమవుతాయని ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఆ స్థాయిలో నిధులను చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఫొటోల్లో కనిపిస్తున్న పంట కాలువలను చూస్తే చాలా ఆనందంగా ఉంది కదా, వేసవిలో సైతం నిండుగా నీరు ప్రవహిస్తోందని భావిస్తున్నారా, కానీ వాస్తవం అది కాదు.. ఇది సముద్రం నుంచి గ్రామాల్లోకి పోటెత్తుతున్న ఉప్పు నీరు. ఇదే కోనసీమ ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేస్తోంది. సుమారు 50 ఏళ్లుగా సాగుతున్న ఓఎన్జీసీ కార్యకలాపాల వల్ల ఇక్కడ భూమి కుంగుతోందని, ఫలితంగానే ఉప్పు నీరు గ్రామాలను ముంచెత్తుతోందని పర్యావరణ ప్రేమికులు గగ్గోలు పెడుతున్నా వాస్తవాలను శాస్త్రవేత్తలు మాత్రం ప్రకటించరనే ప్రచారం ఇక్కడ ఉంది. ఎందుకంటే ఇక్కడ కోట్లాది రూపాయల ఆయిల్ వ్యాపారాలను ప్రజలు అడ్డుకుంటారని భయం. – మలికిపురం
సముద్రం నుంచి గ్రామాల్లోకి పోటెత్తుతున్న ఉప్పునీరు
వేసవిలోనూ డెల్టా ప్రాంత కాలువల్లో నీటితో తీవ్ర నష్టం
మరోవైపు లైడార్ సర్వేలోనూ వెలుగు చూస్తున్న వాస్తవాలు
ఉప్పు నీటి ప్రవేశంతోపచ్చని పంట పొలాలు నాశనం
అడ్డుకట్ట వేయకుంటే డెల్టా ప్రాంత వాసుల భవిష్యత్తు దుర్భరమే


