ఫ కారు ప్రమాదంలో ముగ్గురి మృతి
ఫ మరొకరి పరిస్థితి విషమం
ఫ మృతుల్లో ఏడాది బాలుడు
గోకవరం/జగ్గంపేట: వారందరూ కారులో ఎంతో ఉత్సాహంగా రంపచోడవరానికి విహార యాత్రకు వెళ్లారు. చక్కగా ఆటపాటలతో సందడి చేస్తూ సంతోషంగా గడిపారు. తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో జరిగిన ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే.. జగ్గంపేట మండలం మల్లిసాలకు చెందిన కందికట్ల ముసలయ్య (నాని) మంగళవారం జగ్గంపేటలోని ఓ ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన ఇన్నోవా కారుని అద్దెకు తీసుకున్నాడు. భార్య దుర్గ, కుమారుడు లక్కీ (ఏడాది వయసు), కుమార్తె నవ్యతో పాటు తనకు వరుసకు తమ్ముడు అయిన రమణ కుమార్, దుర్గ సోదరి బల్లెల పద్మ (19), మరో యువకుడు కొండేపూడి వివేక్ (19)లను తీసుకుని రంపచోడవరం విహార యాత్రకు వెళ్లాడు. ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు అక్కడ సంతోషంగా గడిపారు. తిరిగి మల్లిసాలకు తిరిగి వస్తున్న క్రమంలో కొత్తపల్లి దాటిన తర్వాత జీడిపిక్కల ఫ్యాక్టరీ సమీపంలో వీరు ప్రయాణిస్తున్న కారు ఫ్యాక్టరీ గోడను, తర్వాత విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో వివేక్, పద్మ అక్కడికక్కడే మృతి చెందగా, ఏడాది వయసున్న లక్కీ గోకవరం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. కారు నడుపుతున్న ముసలయ్య తీవ్రంగా గాయపడగా, రాజమహేంద్రవరం తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో దుర్గ, నవ్య, రమణ కుమార్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న కోరుకొండ సీఐ మూర్తి, గోకవరం ఎస్సై పవన్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం రాజమహేంద్రవరం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదం జరిగిన తీరు
కారులో ప్రయాణిస్తున్న కందికట్ల దుర్గ కథనం మేరకు వీరు ప్రయాణిస్తున్న కారు కొత్తపల్లిలో ఓ బైక్‌ను చిన్నగా ఢీకొట్టింది. దీంతో కంగారు పడిన ముసలయ్య కారును వేగంగా నడపడంతో అదుపు తప్పి ఈ ప్రమాదం సంభవించినట్టు తెలుస్తుంది. మరో 10 కిలోమీటర్లు ప్రయాణిస్తే క్షేమంగా ఇంటికి చేరుకునేవారు. ఈలోపు ఈ ప్రమాదం జరిగిన ముగ్గురి ప్రాణాలను బలి తీసుకుంది. విషయం తెలుసుకున్న వెంటనే ముసలయ్య కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు.
నెల రోజుల్లో పెళ్లి
బల్లెల పద్మకు వివాహం కుదిరింది. వచ్చే నెలలో పెళ్లి పీటలు ఎక్కాల్సి ఉంది. ఈ లోపు రోడ్డు ప్రమాదంలో ఆమె మృత్యుఒడికి చేరింది. పద్మకు చిన్నప్పుడే తల్లిదండ్రులు దూరం కావడంతో అమ్మమ్మ దిమ్మల అర్జమ్మ ఎంతో కష్టపడి పెంచింది. మనవరాలి వివాహం కళ్లారా చూడాలనుకుంటున్న సమయంలో జరిగిన ప్రమాదం అర్జమ్మను విషాదంలో ముంచేసింది.
నిరుపేద కుటుంబం
కొండేపూడి వివేక్‌ది నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులకు అండగా ఉంటూ కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. సరదాగా విహార యాత్రకు వెళ్లిన వివేక్ మృత్యువాత పడడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చేతికంది వచ్చిన కుమారుడు చనిపోవడంతో ఎంతగానో రోదిస్తున్నారు.
కలసి రావడంతో..
కందికట్ల ముసలయ్య (నాని), దుర్గ దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమారుడు పుట్టిన తర్వాత ముసలయ్యకు ఆర్థికంగా కలిసి రావడంతో ఆ బాబుకు లక్కీ అని పేరు పెట్టారు. పిల్లలను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న సమయంలో రోడ్డు ప్రమాదం లక్కీని కాటేసింది. ఆ కుటుంబంలో తీరని విషాదం మిగిల్చింది.


