కపిలేశ్వరపురం: పడమర ఖండ్రిక గ్రామానికి చెందిన సీహెచ్.సత్యనారాయణ వ్యవసాయ క్షేత్రంలో వరి పంటను కోసి వదిలేసిన గడ్డి మంగళవారం దగ్ధమైంది. గుర్తు తెలియని వ్యక్తి అజాగ్రత్తగా సిగరెట్ కాల్చి పడేయడంతో ప్రమాదం జరిగినట్టు స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటనలో రైతుకు చెందిన రూ.పది వేల విలువైన ఆరు ఎకరాల్లోని గడ్డి పూర్తిగా కాలిపోయింది. మండపేట అగ్నిమాపక కేంద్రం లీడింగ్ ఫైర్‌మెన్ పి.లోవరాజ, సిబ్బంది జి.భరత్‌బాబు, ఎన్ కిరణ్ కుమార్ మంటలను ఆర్పారు.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో..
మండపేట కొండపల్లివారి వీధిలోని బి.వెంకట రమణమూర్తి ఇంటిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా గృహోపకరణాలు కాలిపోయాయి. అనపర్తి అగ్నిమాపక కేంద్రం అధికారి వి.సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలోని సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఇంటిలోని ఏసీ, మంచం, పరుపులు, ఇతర సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు రూ.లక్ష నష్టం వాటిల్లినట్టు ఫైర్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం తెలిపారు.


