పెట్రో బాంబ్‌ | - | Sakshi
Sakshi News home page

పెట్రో బాంబ్‌

May 26 2026 3:02 AM | Updated on May 26 2026 3:02 AM

మళ్లీ

పది రోజుల్లో నాలుగు సార్లు బాదుడు

తాజాగా పెట్రోల్‌పై రూ. 2.84

డీజిల్‌పై రూ.2.86 చొప్పున పెంపు

సామాన్యుడిపై పెను భారం

సాక్షి, రాజమహేంద్రవరం: అమెరికా–ఇరాన్‌ యుద్ధ సంక్షోభాన్ని చూపుతూ ప్రభుత్వం చమురు మంట పెట్టింది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై బాదుడే.. బాదుడు విధానాన్ని కొనసాగిస్తోంది. గడిచిన పది రోజుల వ్యవధిలో నాలుగు సార్లు ధరలు పెంచి సామాన్యుడిపై మోయలేని భారాన్ని మోపింది. తాజాగా లీటర్‌ పెట్రోల్‌పై రూ.2.84 పైసలు, డీజిల్‌పై రూ.2.86 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జిల్లాలో ప్రతి రోజూ లీటర్‌ పైట్రోల్‌పై రోజుకు రూ.13.54 లక్షలు, డీజిల్‌పై రోజు రూ.16.50 లక్షల అదనపు భారం పడుతోంది. వెరసి రోజుకు పెట్రోల్‌, డీజిల్‌పై రూ.30.04 లక్షల భారం వినియోగదారులు మోయాల్సి వస్తోంది. నెలకు సుమారు రూ.9.01 కోట్ల భారం పడుతోంది. పెరిగిన ధరలతో లీటర్‌ పెట్రోల్‌ రూ.118.06, డీజిల్‌ రూ.105.69గా విక్రయిస్తున్నారు. పెరిగిన ధరలు సోమవారం తెల్లవారుజాము నుంచే అమల్లోకి వచ్చాయి. ధరల పెంపుతో వాహనదారుల్లో ఆందోళన నెలకొంది. పెంచుకుంటూ పోతే తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ఆటో, కార్‌ తదితర వాహన దారులు ఆవేదన చెందుతున్నారు. పది రోజుల వ్యవధిలో నాలుగు సార్లు ఇంధన ధరలు పెరిగాయి. ఈ నెల 15వ తేదీన లీటరు పెట్రోల్‌పై రూ.3.29, డీజిల్‌పై రూ.3.14 పెంచారు. ఈ నెల 19న లీటర్‌ పెట్రోల్‌పై రూ.92 పైసలు, డీజిల్‌పై రూ.91 పైసలు పెరిగింది. 23న లీటర్‌ పెట్రోల్‌పై రూ.97 పైసలు, డీజిల్‌పై రూ.99 పైసలు పెంచారు.

వినియోగదారులపై రూ.29.94 కోట్ల భారం:

జిల్లా వ్యాప్తంగా 200 పెట్రోల్‌, డీజిల్‌ బంకులు ఉన్నాయి. వాటిలో ప్రభుత్వ చమురు కంపెనీల పెట్రోల్‌ బంకులు 177, ప్రైవేటువి 23 ఉన్నాయి. హెచ్‌పీసీఎల్‌, ఐఓసీఎల్‌, బీపీసీఎల్‌ బంకుల ద్వారా రోజువారీ సాధారణ పెట్రోలు అమ్మకాలు 4.77 లక్షల లీటర్లు, డీజిల్‌ 5.77 లక్షల లీటర్ల విక్రయాలు జరుగుతున్నాయి. మొదటి సారి పెరిగిన ధరలతో రోజుకు రూ.33.81 లక్షలు, రెండో సారి రూ.9.63 లక్షలు, మూడో సారి రూ.9.66 లక్షలు, తాజాగా నాలుగో సారి పెరిగిన ఇంధన ధరలతో రోజుకు వినియోగదారులపై రూ.30.04 లక్షల భారం పడుతోంది. నాలుగు దఫాలుగా పెరిగిన ధరలతో రోజుకు వినియోగదారులపై రూ.83.14 లక్షల భారం పడుతోంది. నెలకు రూ.24.94 కోట్ల అదనపు భారం భరించాల్సి వస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement