రంపచోడవరం: ఆడపిల్లలను ఉన్నత చదువులు చదివించేందుకు తల్లిదండ్రులు తగిన ప్రోత్సాహమివ్వాలని జిల్లా కలెక్టర్ కె.దినేష్‌కుమార్ అన్నారు. ఇందుకు తగిన సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. ఐటీడీఏ సమావేశ హాలులో సోమవారం అడ్డతీగల మండలం సోమన్నపాలెం గ్రామానికి చెందిన గిరిజన బాలిక బూడిద లోవకుమారి విశాఖపట్నంలో లా పూర్తి చేసి మాస్టర్ లా చేసేందుకు జిల్లా కలెక్టర్‌ను ఆర్థిక సహాయం చేయమని కోరింది. లా పూర్తి చేసిన బూడిద లోవకుమారిని జిల్లా కలెక్టర్ కె.దినేష్ కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ప్రశాంత్‌కుమార్ శాలువాతో సన్మానించారు. బూడిద లోవకుమారి తల్లిదండ్రులైన బూడిద దేవుడు, లక్ష్మీదేవీ కూలి పనులు చేసుకుంటూ కుమార్తెను న్యాయవాదిగా చదివించడం చాలా గొప్ప విశేషమన్నారు. పోలవరం జిల్లాలోని ప్రతి గిరిజన బాలికలు తల్లిదండ్రులకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా చదివించాలని అందుకు జిల్లా యంత్రాంగం ప్రోత్సహిస్తుందని ఆయన అన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలలో ఉచిత విద్య, ఉచిత భోజన వసతి సౌకర్యంతో పాటు విద్యార్థులకు కావలసిన మెటీరియల్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన అన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పి. అంబేద్కర్, డీడీ రుక్మాంగదయ్య, ఏపీవో డీఎన్‌వీ రమణ, డీహెచ్‌ఓ దేవదానం తదితరులు పాల్గొన్నారు.
జీడిమామిడి ప్రాసెసింగ్ యూనిట్ల
ఏర్పాటుకు ప్రతిపాదనలు
రంపచోడవరం: క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం కింద రబ్బరు, జీడిపప్పు ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, ప్రభుత్వ నూతన మార్గదర్శకాల ప్రకారం క్లస్టర్ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కె.దినేష్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ మార్గదర్శకాల ప్రకారం పోలవరం జిల్లాలో రబ్బరు, జీడిపప్పు ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు సంబంధించిన ప్రతిపాదనలను తక్షణమే సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ రూ.200 కోట్లతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో, జిల్లాలో ఉన్న సహజ వనరులు, గిరిజన ప్రాంతాల సామర్థ్యాలను వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు. కలెక్టర్ మాట్లాడుతూ, క్లస్టర్ విధానంలో కామన్ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటు ద్వారా సూక్ష్మ పరిశ్రమలకు యంత్రాలు, ప్రాసెసింగ్, నాణ్యత ప్రమాణాలు, మార్కెటింగ్, శిక్షణ వంటి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ముఖ్యంగా రబ్బరు, జీడిపప్పు ఆధారిత పరిశ్రమలకు మంచి అవకాశాలు ఉన్నందున జిల్లా హార్టికల్చర్ అధికారి, జిల్లా పరిశ్రమల కేంద్రం అధికారులు సమన్వయంతో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి ప్రభుత్వం నూతనంగా రూపొందించిన మార్గదర్శకాలను అనుసరించి ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు.
గౌతమి బోర్డు తిప్పేసిందా?
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): కాకినాడలో జయలక్ష్మి, కార్తికేయ సొసైటీలు బాధితులను ముంచిన ఘటనలు మరవకముందే మరో సొసైటీ వ్యవహారం వెలుగు చూసింది. నగరంలోని జన్మభూమి పార్క్ వద్దన్న గౌతమి సిటిజన్స్ పరస్పర సహాయ సహకార పొదుపు సంఘం బోడ్డు తిప్పేసిందన్న సమాచారంతో డిపాజిట్‌దారులు గగ్గోలు పెడుతున్నారు. రెండు సంవత్సరాల నుంచి సహకార సంఘాలు సభ్యుల ఫిక్స్‌డ్ డిపాజిట్‌లు గడువు ముగిసినా డబ్బు ఇవ్వకపోవడంతో బాధితులు సహకార సంఘం అధికారులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర సహకార శాఖ కమిషనర్ విచారణ చేయాలని జిల్లా శాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. గౌతమి సొసైటీ చైర్మన్ వాకలపూడి తిరుపతిరాయుడు నగరంలోని రిటైర్డు ఉద్యోగుల నుంచి భారీగా డిపాజిట్లు సేకరించినట్లు తెల్సింది. గౌతమి సహకార సంఘంపై విచారణ చేయాలని కాకినాడ సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్ జె శివకామేశ్వరరావును ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ మేరకు ఆయన ఈ నెల 29,30 తేదీల్లో సంఘంలో పొదుపు చేసిన డిపాజిట్‌దారుల నుంచి వాంగ్మూలాలు తీసుకొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయంపై జిల్లా సహకార అధికారి శ్రీనివాసులు రెడ్డిని వివరణ కోరగా సంఘ చైర్మన్‌కు ఇప్పటికే నోటీస్ ఇచ్చినట్లు చెప్పారు.


