రంపచోడవరం: ఢిల్లీలో ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో జనజాతి సురక్ష మంచ్ ఆధ్యర్యంలో జరిగిన సమావేశంలో భారత రాజ్యాంగం ఆదివాసులను గుర్తించి, చేర్చే అధికారం కలిగిన ఆర్టికల్ 342 రద్దు చేయాలని, మత స్వేచ్ఛ హక్కు కల్పిస్తున్న ఆర్టికల్ 25కు భంగం కలిగించే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదివాసీ గిరిజన సంఘం రంపచోడవరంలో సోమవారం జరిగిన గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం తీవ్రంగా ఖండించింది. కేంద్ర బీజేపీ గిరిజన గుర్తింపు మత స్వేచ్ఛ రక్షణ కల్పించే 342, 25 ఆర్టికల్ రద్దు డిమాండ్‌పై కూటమి ప్రభుత్వం వైఖరి తెలపాలని డిమాండ్ చేశారు. భారత దేశ వ్యాప్తంగా మతం మారిన గిరిజనులకు రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఆదివాసులకు గుర్తింపు నిచ్చే ఆర్టికల్ 342 రద్దు చేయాలని బీజేపీ, జనజాతి సురక్ష మంచ్ ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి సమావేశం డిమాండ్ చేయడాన్ని ఆదివాసీ గిరిజన సంఘం తీవ్రంగా వ్యతిరేస్తోందన్నారు. రాజ్యాంగం ప్రకారం మత స్చేచ్ఛ హక్కు కల్పించబడిందన్నారు. భారత రాజ్యాంగం ఆదివాసీలకు గుర్తింపు మత స్వేచ్చ రక్షణ కల్పిస్తున్న ఆర్టికల్‌కు వ్యతిరేకంగా మాట్లాడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఆదివాసుల రిజర్వేషన్లు హక్కు రద్దు చేసే కుట్రలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర, పోలవరం జిల్లా కార్యదర్శి పి.సంతోష్, అల్లూరి సీతారామరాజు జిల్లా కార్యదర్శి పి.బలదేవ్, రాష్ట్ర కమిటీ సభ్యులు కె.చిన్నం నాయుడు, పి.నాగేశ్వరరావు పాల్గొన్నారు.


