ఫ ఆటోను ఢీకొని ఈడ్చుకుపోయిన వైనం
ఫ మహిళ మృతి, ఏడుగురికి గాయాలు
పి.గన్నవరం: రాజవరం – పొదలాడ రోడ్డులో నాగుల్లంక వద్ద సోమవారం మధ్యాహ్నం ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఎదురుగా వేగంగా వస్తున్న టిప్పర్ ఢీకొనడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో మహిళ తీవ్ర గాయాలపాలై అపస్మారక స్థితికి చేరుకుంది. ఆటో డ్రైవర్‌తో పాటు ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. తాటిపాక మఠం గ్రామానికి చెందిన నాట్ర శివకుమార్ (42) రాజమహేంద్రవరంలో స్థిరపడ్డాడు. అతను ఆదివారం వడగాడ్పులకు మృతి చెందాడు. దీంతో శివకుమార్ అంత్యక్రియల నిమిత్తం తాటిపాక మఠం, పక్కనే పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం పెదలంక గ్రామాలకు చెందిన కుటుంబ సభ్యులు ఎనిమిది మంది సోమవారం తెల్లవారు జామున ఆటోలో రాజమహేంద్రవరానికి వెళ్లారు. అక్కడ అంత్యక్రియలు పూర్తయిన తర్వాత మధ్యాహ్నం 1 గంటకు తిరిగి ఇంటికి ఆటోలో పయనమయ్యారు. వారి ఆటో నాగుల్లంక యూనియన్ బ్యాంకు సమీపానికి వచ్చేసరికి ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీకొట్టి, కొంత దూరం ఈడ్చుకుపోయింది. ఈ ప్రమాదంలో శివకుమార్ అక్క చింతలమోరికి చెందిన మల్లాడి పద్మ (55) అక్కడికక్కడే మృతి చెందింది. జొన్నల్లంకకు చెందిన ఆటో డ్రైవర్ తిరుమాని నాగరాజు, తాటిపాక మఠం, పెదలంక ప్రాంతాలకు చెందిన నాట్ర శ్రీనివాసరావు, అతని భార్య నివేదిత దేవి, నాట్ర నరసింహరాజు గాయాల పాలయ్యారు. అలాగే నాట్ర ఉదయ కుమార్‌కు స్వల్ప గాయాలు కాగా, అతని భార్య కృష్ణకుమారికి తీవ్ర గాయాలయ్యాయి. నాట్ర లక్ష్మి ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడగా, వైదాని లక్ష్మికి స్వల్ప గాయాలయ్యాయి. క్షత గాత్రులకు స్థానిక పీహెచ్‌సీ వైద్య సిబ్బంది సేవలు అందించారు. మిగతా క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లలో స్థానికులు హుటాహుటిన పి.గన్నవరం సీహెచ్‌సీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
తమ్ముడి అంత్యకియలకు వెళ్లి..
రాజమహేంద్రవరంలో తమ్ముడు నాట్ర శివకుమార్ అంత్యక్రియల్లో పాల్గొని తిరిగి వస్తున్న అక్క మల్లాడి పద్మ (55) దారిలో మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. పద్మ మృతదేహం వద్ద వారు బోరున విలపించారు.
న్యాయం చేయాలని ఆందోళన
ఆటో ప్రమాదంలో మల్లాడి పద్మ మృతి చెందగా, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నాగుల్లంకలో మృతురాలి బంధువులు ఆందోళన చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన వారంతా కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని బంధువులు తెలిపారు. టిప్పర్‌ను డ్రైవర్ మితిమీరిన వేగంతో నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.


