నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): వేసవి సెలవులు అంటేనే ఆటల ప్రపంచంలో మునిగితేలే రోజులు.. అలాంటి సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు యువ తరంగం ఉత్సాహంగా ముందుకు వస్తోంది. వీరి కోసం కాకినాడ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని అర్బన్, రూరల్ ప్రాంతాల్లో 35 వేసవి శిక్షణా శిబిరాలు, కాకినాడ డీఎస్‌ఏలో 15 శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇందులో సుమారు 3 వేల మంది వరకూ శిక్షణ పొందుతున్నారు. పిఠాపురం, విరవ, అన్నవరం, జగ్గంపేట, కాట్రావులపల్లి, గొల్లపాలెం, కాజులూరు, రమణయ్యపేట, వాకలపూడి, చీడిగ, కిర్లంపూడి, లంపకలోవ, సామర్లకోట, తుని, యు.కొత్తపల్లి, ఎండపల్లి, ఏలేశ్వరం, ముసలయల్యపేటతో పాటు కాకినాడ అర్బన్ ఎంఎస్‌ఎన్ చారిటీస్, సాలిపేట, ఏపీఎస్పీ, డీఎస్‌ఏలో ఈ శిబిరాలు జరుగుతున్నాయి. 30 రోజుల పాటు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు శిక్షణ ఇస్తున్నారు. బాస్కెట్‌బాల్, ఆర్చరీ, ఖోఖో, కబడ్డీ, క్రికెట్, స్విమ్మింగ్, రైఫిల్ షూటింగ్, వాలీబాల్, బ్యాడ్మింటన్, వెయిట్ లిఫ్టింగ్, హాకీ, జిమ్నాస్టిక్స్, లాన్ టెన్నిస్, ఫుట్‌బాల్, అథ్లెటిక్స్ తదితర 15 క్రీడాంశాల్లో తర్ఫీదు పొందుతున్నారు. ఇలా జిల్లాలో మొత్తం 50 వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నట్లు కాకినాడ జిల్లా క్రీడాభివృద్ధి అధికారి వి.సతీష్‌కుమార్ తెలిపారు. ఆసక్తి గలవారు 94400 31601 నంబరులో సంప్రదించాలని కోరారు.


