అగ్నిగుండం | - | Sakshi
Sakshi News home page

అగ్నిగుండం

May 25 2026 3:28 AM | Updated on May 25 2026 3:28 AM

రాజమహేంద్రవరంలో వెలవెలబోతున్న దేవీచౌక్‌ సెంటర్‌

రాజమహేంద్రవరం రూరల్‌: ఎల్‌నినో ప్రభావంతో కొద్ది రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలతో జిల్లా ప్రజలు అల్లాడిపోతున్నారు. వారం రోజులుగా 45 డిగ్రీల సెల్సియస్‌కు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికి కొనసాగింపా అన్నట్టు ఆదివారం జిల్లా అగ్నిగుండమే అయ్యింది. ఇండియన్‌ లీఫ్‌ టొబాకో డెవలప్‌మెంట్‌ (ఐఎల్‌టీడీ) రికార్డుల ప్రకారం జిల్లా కేంద్రం రాజమహేంద్రవరంలో ఏకంగా 49 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోనే ఇది అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత కావడం గమనార్హం. గోపాలపురం మండలం చిట్యాలలో కూడా అత్యధికంగా 48.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిడదవోలు తదితర ప్రాంతాల్లో కూడా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఉదయం నుంచే..

ఉదయం 9 గంటల నుంచి వాతావరణం క్రమంగా వేడెక్కిపోవడంతో ఇళ్ల నుంచి బయటకు రావడానికి ప్రజలు సాహసించలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వచ్చిన వారు రోడ్లపై ప్రయాణిస్తూంటే అగ్నిగుండంలో వెళ్తున్న అనుభూతికి గురయ్యారు. మండిపడిన మార్తాండుడి ధాటికి కాళ్ల కింద నేల.. వీస్తున్న గాలి అన్నీ వేడెక్కిపోవడంతో నిప్పురవ్వలు రాజుకున్నట్టు అనిపించింది. అగ్నికి వాయువు తోడైనట్టు.. చండప్రచండంగా కాస్తున్న ఎండలకు గోదావరిలోని నీరు ఆవిరవుతోంది. మరోవైపు గోదావరిలోని ఇసుక తిన్నెలు వేడెక్కిపోతున్నాయి. రాజమహేంద్రవరం నగరంలో అత్యధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలులకు ఈ పరిస్థితులు కూడా కారణమవుతున్నాయి. అదే సమయంలో నీరు ఆవిరవుతూండటంతో గాలిలో తేమ కూడా పెరిగిపోతోంది. దీంతో, ఇటు తీవ్రమైన ఎండలు, అటు ఉక్కపోతకు తాళలేక, నిద్ర పోలేక ప్రజలు ఆపసోపాలు పడుతున్నారు. ఇంట్లో ఫ్యాన్లు వేసినా వేడిగాలే రావడంతో దిక్కు తోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తీవ్రమైన వేడి వాతావరణం ఏర్పడటంతో మధ్యాహ్నం వేళల్లో ప్రధాన రహదారులన్నీ జనసంచారం లేక వెలవెలబోతున్నాయి. పలు ప్రాంతాల్లో వ్యాపారులు మధ్యాహ్నం వేళ దుకాణాలను సైతం మూసివేశారు. బతుకుతెరువు కోసం రోడ్ల పక్కన చిరు వ్యాపారులు మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో గొడుగులు వేసుకుని, చెట్ల నీడన కొనుగోలుదారుల కోసం ఎదురు చూస్తూ వ్యాపారాలు సాగించారు.

పెరుగుతున్న డీహైడ్రేషన్‌ బాధితులు

తీవ్రమైన ఎండలతో గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, వృద్ధుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఎండ తీవ్రత కారణంగా రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ బోధనాసుపత్రితో పాటు జిల్లాలోని సీహెచ్‌సీలు, పీహెచ్‌సీల్లో డీహైడ్రేషన్‌, వడదెబ్బ, జ్వరం బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. చిన్నారుల్లో చర్మ సంబంధమైన ఇబ్బందులు, వృద్ధుల్లో బీపీ, షుగర్‌ లెవెల్స్‌లో హెచ్చుతగ్గుల వంటి సమస్యలు వస్తున్నాయి.

అప్రమత్తంగా ఉండాలి

రానున్న రెండు రోజులకు వాతావరణ శాఖ వడగాలుల హెచ్చరికలు జారీ చేసింది. వడదెబ్బకు గురవకుండా ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఎండల తీవ్రత నేపథ్యంలో వైద్య నిపుణులు సైతం పలు సూచనలిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఎండలోకి రాకపోవడమే ఉత్తమమని చెబుతున్నారు. ఆ సమయంలో వడదెబ్బ తగిలే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. వడదెబ్బ తగిలిన వ్యక్తిని వెంటనే చల్లని ప్రదేశానికి తీసుకెళ్లాలని, తడిగుడ్డతో శరీరాన్ని తుడవాలని, మజ్జిగ, ఓఆర్‌ఎస్‌, కొబ్బరి నీళ్ల వంటివి ఇవ్వాలని, పరిస్థితి విషమిస్తే వెంటనే ఆస్పత్రికి తరలించాలని సూచిస్తున్నారు.

నిర్మానుష్యంగా ఉన్న నిడదవోలు ఆర్‌ఓబీ

రాజమహేంద్రవరంలో జనం కానరాని ఆజాద్‌ చౌక్‌ సెంటర్‌

మధ్యాహ్నం వేళ దేవరపల్లి వద్ద వాహన సంచారం లేని 16వ నంబర్‌ హైవే

ఈ జాగ్రత్తలు మేలు

ఫ దాహం వేయకపోయినా ప్రతి గంటకు ఒకసారి నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి.

ఫ మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, ఓఆర్‌ఎస్‌ ద్రావణాలు ఎక్కువగా తీసుకోవాలి. ఇవి శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్లను అందిస్తాయి.

ఫ పుచ్చకాయ, ఖర్బూజ, ద్రాక్ష, నారింజ వంటి నీటి శాతం ఎక్కువ ఉన్న పండ్లను ఆహారంలో చేర్చుకోవాలి.

ఫ వేసవిలో జంక్‌ఫుడ్‌, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని నాన్‌వెజ్‌ వంటకాలను సాఽ ద్యమైనంతగా తగ్గించాలి. సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవడం మంచిది.

ఫ తప్పనిసరి పరిస్థితిల్లో బయటకు వెళ్లాల్సి వస్తే, తలకు టోపీ/రుమాలు చుట్టుకోవాలి. గొడుగు వినియోగించడం మంచిది.

ఫ లేత రంగు కాటన్‌ దుస్తులు ధరించాలి. ఇవి చెమటను పీల్చుకుని, శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడతాయి.

ఫ వేసవిలో ఆహారం త్వరగా పాడవుతుంది. ఎప్పటికప్పుడు తాజాగా వండుకున్న ఆహారాన్ని తీసుకోవాలి.

ఫ రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున, ప్రతి ఒక్కరు వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ద వహించాలి.

ఫ భగ్గుమన్న భానుడు

ఫ రాజమహేంద్రవరంలో

49 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత

ఫ చిట్యాలలో 48.3 డిగ్రీలు

ఫ సెగభగలతో ప్రజలు విలవిల

Advertisement
 
Advertisement
Advertisement