గోదారమ్మకు గర్భశోకం | - | Sakshi
Sakshi News home page

గోదారమ్మకు గర్భశోకం

May 25 2026 3:28 AM | Updated on May 25 2026 3:28 AM

వాడపల్లి ఇసుక ర్యాంపులు

నిబంధనలకు తెలుగు తమ్ముళ్ల నీళ్లు

డ్రెడ్జర్లతో యథేచ్ఛగా తవ్వకాలు

వందల లారీల్లో తరలింపు

పెరవలి (కొవ్వూరు): నిబంధనలను గోదాట్లో తొక్కేస్తున్న తెలుగు తమ్ముళ్లు గోదారమ్మకు నిలువెల్లా తూట్లు పొడుస్తూ గర్భశోకాన్ని మిగిలిస్తున్నారు. కొవ్వూరు మండలం వాడపల్లిలో రెండు ర్యాంపులున్నాయి. వీటిని ఇసుక తవ్వకాల కోసం అధికారులు బోట్స్‌మెన్‌ సొసైటీకిచ్చారు. ఇదే అదునుగా అధికారం అండతో తెలుగు తమ్ముళ్లు గోదావరిలో ఇష్టానుసారం ఇసుక తోడేస్తున్నారు.

నిబంధనల ఉల్లంఘనలు ఇలా..

● నదీ గర్భంలో యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేయకూడదు. కేవలం పడవలతో నదిలోకి వెళ్లి బకెట్లతో మనుషులు మాత్రమే ఇసుక తీయాలి. కానీ, వాడపల్లి ర్యాంపుల్లో తమ్ముళ్లు కాసులపై దురాశతో రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఇష్టానుసారం డ్రెడ్జర్లతో ఇసుక తోడేస్తున్నారు. నదీగర్భాన్ని నిలువునా చీల్చేస్తున్నారు.

● మైనింగ్‌ చట్టం ప్రకారం గోదావరి గట్టుకు 200 మీటర్ల పరిధిలో మాత్రమే ఇసుక తవ్వకాలు జరపాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ యంత్రాలతో నదీగర్భంలోని ఇసుకను తవ్వకూడదు. ఈ నిబంధనను ఇక్కడ పట్టించుకున్నవారే లేకుండా పోయారు.

● ఇసుక తవ్వకాలకు అనుమతి ఇచ్చిన తరువాత జియో కో ఆర్డినేషన్‌ ప్రకారం హద్దులు నిర్ణయిస్తారు. దాని ప్రకారమే తవ్వకాలు జరపాలి. కానీ, ఇక్కడ అటువంటి నిబంధనలను ఎవ్వరూ ఖాతరు చేయడం లేదు.

● ఎక్కడైనా ఖాళీ జాగా కనిపిస్తే చాలు.. తవ్విన ఇసుకను అక్కడ గుట్టలుగా నిల్వ వేస్తున్నారు. ముఖ్యంగా కుమారదేవం, కొవ్వూరు, ఔరంగబాద్‌, ఆరికరేవుల, వాడపల్లి, ప్రక్కిలంక, పురుషోత్తపల్లి గ్రామాల్లో భారీ స్థాయిలో నిల్వ చేస్తున్నారు. పగలంతా నిల్వలు వేస్తూంటే రాత్రుళ్లు ఐదు యూనిట్ల లారీలతో అమ్మకాలు చేస్తున్నారు.

● నిబంధనలు అమలు చేయాల్సిన అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఫలితంగా వాడపల్లిలోని రెండు ర్యాంపుల నుంచి రోజుకు 200 నుంచి 300 లారీల్లో ఇసుకను యథేచ్ఛగా తరలించేస్తున్నారు. వివిధ శాఖల అధికారులు చూసీచూడనట్లు వదిలేయడానికి గాను ఈ ర్యాంపుల్లో నెలకు రూ.7.80 లక్షల మేర ముట్టజెబుతున్నట్లు కూలీలే బహిరంగంగా చెప్పుకొంటున్నారు.

వాడపల్లి వద్ద గోదావరిలో

డ్రెడ్జర్లతో ఇసుక తోడేస్తున్నారిలా..

ఆరికరేవుల వద్ద వేసిన ఇసుక గుట్టలు

Advertisement
 
Advertisement
Advertisement