వాసు.. కస్సుబుస్సు | - | Sakshi
Sakshi News home page

వాసు.. కస్సుబుస్సు

May 25 2026 3:28 AM | Updated on May 25 2026 3:28 AM

సాక్షి, రాజమహేంద్రవరం: నగరంలో టీడీపీ, జనసేన మధ్య వర్గ విభేదాలు నెలకొన్నాయా.. పర్యాటక మంత్రి కందుల దుర్గేష్‌, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మధ్య సఖ్యత కొరవడిందా.. పైకి ఇద్దరు నేతలూ కలిసి ఉంటున్నట్టున్నా.. ఇద్దరి మధ్య అంతర్గతంగా అంతరం నెలకొందా.. అంటే అవుననే సమాధానం వస్తోంది రాజకీయ విశ్లేషకుల నుంచి. వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాల సందర్భంగా పుష్కర ఘాట్‌లో చేపట్టిన పనులను డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సోమవారం పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ పనులను ఇటీవల మంత్రి దుర్గేష్‌తో పాటు, జిల్లా అధికారులు ప్రత్యేకంగా పడవలో వెళ్లి మరీ పరిశీలించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వాసు గైర్హాజరయ్యారు. దీనికితోడు పవన్‌ కల్యాణ్‌ పర్యటన నేపథ్యంలో పుష్కర ఘాట్‌ పనులపై వాసు బహిరంగ విమర్శలు చేయడం రాజమహేంద్రవరంలో చర్చనీయాంశంగా మారింది.

వాసు ఏమన్నారంటే..

పుష్కర ఘాట్‌లో చేపడుతున్న అభివృద్ధి పనులపై నగరంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్యే వాసు బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. పనులు నిర్వహిస్తున్న తీరును తప్పు పట్టారు. ఈ పనులు జరుగుతున్న సమాచారం స్థానిక ఎమ్మెల్యే అయిన తనకు లేదన్నారు. కనీసం మంత్రి దుర్గేష్‌కై నా సమాచారం ఇస్తున్నారా అని ప్రశ్నించారు. ఘాట్‌లో కొత్తగా అమరుస్తున్న టైల్స్‌ జారుడు స్వభావం ఉన్నట్లు గమనించామన్నారు. గత పుష్కరాల దుర్ఘటన నేపథ్యంలో అలాంటి టైల్స్‌ అమర్చడమేమిటని ప్రశ్నించారు. అంతే కాకుండా గోదావరి మాత విగ్రహం ఎదురుగా వాటర్‌ ఫౌంటైన్‌ అవసరమా అని ప్రశ్నించారు. దీనిపై ఎంపీ పురంధేశ్వరి సైతం అసహనం వ్యక్తం చేశారన్నారు. ఫౌంటైన్‌ పనులు ఆపిస్తామని ఎంపీ చెప్పారన్నారు. ఈ విషయమై మంత్రి దుర్గేష్‌తో చర్చిస్తానని ప్రకటించారు. వాస్తవానికి పుష్కర ఘాట్‌లో పనులు రెండు నెలలకు పైగా జరుగుతున్నాయి. అయినప్పటికీ ఈ విషయం ఎమ్మెల్యేకి తెలియకపోవడమేమిటనే ప్రశ్న తలెత్తుతోంది. వాసు వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రితో సఖ్యత ఏ మేరకు ఉందో అర్థమవుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

సమన్వయం లేకపోతే ఎలా?

గోదావరి పుష్కరాలు వైభవంగా నిర్వహిస్తామని చంద్రబాబు ప్రభుత్వం గొప్పగా ప్రకటిస్తోంది. కానీ, క్షేత్ర స్థాయిలో శాఖల మధ్య సమన్వయం ఉండటం లేదు. స్వపక్ష నేతల మధ్యనా అదే పరిస్థితి. రూ.94 కోట్లతో చేపడుతున్న పనులపై కూటమి పార్టీల నేతల మధ్యనే సమన్వయం లేకపోవడం ఆశ్చర్యం కలిగించక మానదు. పరిస్థితి ఇలాగే ఉంటే పుష్కరాల నిర్వహణ ఎలాగనే ప్రశ్న తలెత్తుతోంది.

వాసు విమర్శలు అందుకేనా?

గోదావరి పుష్కరాల నేపథ్యంలో సుమారు రూ.94 కోట్ల పర్యాటక శాఖ నిధులతో పుష్కర ఘాట్‌ సుందరీకరణ చేపడుతున్నారు. మొత్తం పనులు పర్యాటక శాఖ ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. ఆ శాఖకు జనసేనకు చెందిన మంత్రి దుర్గేష్‌ సారఽథ్యం వహిస్తున్నారు. ఈ పనుల టెండర్లను జనసేన నేతల అనుగ్రహం ఉన్న వారికే కట్టబెట్టారన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో తన ప్రమేయం లేకుండానే రూ.కోట్ల విలువైన పనులు చేపడుతున్నారనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యే వాసు ఈ విమర్శలు చేశారా అనే ప్రశ్న తలెత్తుతోంది. తమ పార్టీ నేతలెవరూ లబ్ధి పొందడం లేదనే ఉద్దేశంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు కాంట్రాక్టర్‌ను సైతం ‘ఒళ్లు దగ్గరపెట్టుకుని పనులు చేయాలి’ అంటూ ఎమ్మెల్యే బహిరంగంగా హెచ్చరించడం వెనుక వేరే ఆంతర్యం దాగి ఉందన్న విమర్శలు వస్తున్నాయి. కొన్ని నెలల నుంచి పనులు జరుగుతున్నా ఏనాడూ బహిరంగంగా మాట్లాడని వాసు ఇప్పుడు విమర్శలు గుప్పించడం వెనుక ఉద్దేశమేమిటోనని పలువురు కూటమి నేతలే చర్చించుకుంటున్నారు.

పవన్‌ పర్యటన నేపథ్యంలో

కూటమిలో విభేదాలు బహిర్గతం

పుష్కర ఘాట్‌ పనుల్లో నాణ్యతపై

టీడీపీ ఎమ్మెల్యే బహిరంగ విమర్శలు

లోకల్‌ ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వడం లేదని ఆగ్రహం

పర్యాటక మంత్రికై నా

చెబుతున్నారా అంటూ అసహనం

నేడు పనులను పరిశీలించనున్న

డిప్యూటీ సీఎం పవన్‌

చర్చనీయాంశంగా మారిన

వాసు వ్యాఖ్యలు

Advertisement
 
Advertisement
Advertisement