ఫ పదోన్నతుల కౌన్సెలింగ్‌లో పంచాయితీ
ఫ సీనియారిటీని కాకుండా
పన్నుల వసూళ్లకే ప్రాధాన్యం
ఫ జీఓ జారీ చేసిన
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ
ఫ సర్వీస్ రూల్స్
అతిక్రమణ అంటున్న ఉద్యోగులు
ఆలమూరు: ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్యదర్శులకు కల్పించిన పదోన్నతుల కౌన్సెలింగ్‌లో సీనియారిటీని పక్కనబెట్టింది. ఇందులో ఇంటి పన్నుల వసూళ్ల ఆధారంగా ఉద్యోగులను ఆయా స్థానాల్లో భర్తీ చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ జీఓ జారీ చేయడం వివాదాస్పదమైంది. దీనివల్ల సర్వీస్ రూల్స్ అతిక్రమణతో పాటు ప్రత్యేక కేటగిరీల రిజర్వేషన్ల అమలుకు తీవ్ర విఘాతం ఏర్పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో అనుభవం, సామర్థ్యం, రిజర్వేషన్లు ఉన్న పంచాయతీ కార్యదర్శులు కౌన్సెలింగ్‌లో వెనుకబడే ప్రమాదముంది. అనుభవంతో సంబంధం లేకున్నా రిజర్వేషన్లతో పనిలేకుండా కౌన్సెలింగ్‌ను త్వరితగతిన పూర్తి చేసుకునే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తూ సీనియర్లకు, అనుభవజ్ఞునులకు మధ్య చిచ్చుపెట్టి తీరని అన్యాయం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పంచాయతీరాజ్ శాఖలో గ్రేడ్–3గా పనిచేస్తున్న గ్రామ పంచాయతీ కార్యదర్శులు (పీడీఓ)లను గ్రేడ్–2లోకి పదోన్నతులు కల్పించేందుకు జీఓ జారీ చేసింది. ఈ పదోన్నతుల్లో రాష్ట్రంలో జోన్–2 పరిధిలోని ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లా వ్యాప్తంగా 227 మంది అర్హత సాధించారు. ఇందులో కొంత మందిని అంతర జిల్లాల బదిలీకి ఒప్పించారు. అధికార పార్టీ ఆశీస్సులు ఉన్నవారిని, వెళ్లేది లేదంటూ ఎదురుతిరిగిన వారిని సొంత జిల్లాల్లోనే పంచాయతీరాజ్ శాఖ ఉంచేసింది.
ఒక్కోచోట ఒక్కో విధంగా?
రాష్ట్రంలోని జోన్–2 పంచాయతీరాజ్ విభాగంలో ఉన్న ఉమ్మడి తూర్పు, పశ్చిమ, కృష్ణా జిల్లాల్లో కౌన్సెలింగ్ ఒక్కోచోట ఒక్కో విధంగా ఉంది. జోన్–2 పరిధిలోని ఉమ్మడి జిల్లాల్లో ఇప్పటి వరకూ ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ జారీ చేసిన జీఓను పట్టించుకోకుండా ఈ నెల 23న అక్కడి అధికారులు ఆన్‌లైన్‌లోనే సీనియారిటీ ప్రాతిపదికన కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్‌లు ఇచ్చేశారు.
అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మాత్రం ఈ నెల 25న ఇంటి పన్నుల వసూళ్ల ఆధారంగానే కౌన్సెలింగ్ ఇస్తామని ఇప్పటికే సర్క్యులర్ జారీ చేసింది. అయితే ఇంకా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లోని అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాలో పీడీఓల కౌన్సెలింగ్ నిర్వహణపై ఇంకా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. కౌన్సెలింగ్‌లో సీనియారిటీ, లేక ఇంటిపన్నుల వసూళ్లకు ప్రాధాన్యం ఇస్తారా అనే దానిపై అంతా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి వివాదాస్పద జీఓల వల్ల పంచాయతీరాజ్ ఉద్యోగుల్లో తీవ్రమైన అసంతృప్తి జ్వాలలు రగిలి గ్రామాల అభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.
ఉన్నతాధికారుల
ఆదేశాల మేరకు కౌన్సెలింగ్
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రేడ్–3 నుంచి గ్రేడ్–2కు పదోన్నతి పొందిన పీడీఓలకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే పీడీఓల సీనియారిటీ పరంగా ఒక జాబితా, ఇంటి పన్నుల వసూళ్లలో అగ్రస్థానంలో ఉన్న మరొకరి జాబితాను రూపొందించి కౌన్సెలింగ్‌కు సిద్ధంగా ఉన్నాం.
–డి.శాంతాలక్ష్మి, జిల్లా పంచాయతీ అధికారి,
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
నిజంగా ఉద్యోగులను ఇరుకున పెట్టే ఆలోచన ఇది.. చంద్రబాబు సర్కారు పదోన్నతుల ప్రక్రియలో ఎప్పుడూ లేని విధానాన్ని తీసుకొచ్చింది.. సీనియారిటీని పక్కనబెట్టి కొత్త సంప్రదాయానికి తెరపైకి తెచ్చింది.. దీనిపై సర్వత్రా నిరసన వెల్లువెత్తుతోంది.. ఇది సర్వీస్ రూల్స్ అతిక్రమణే అంటూ ఉద్యోగుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది.
జీఓ జారీపై మండిపాటు
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 1,071 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో గ్రేడ్–3 నుంచి గ్రేడ్–2 పదోన్నతులు పొందిన వారు 198 మంది, జోన్–2 పరిధిలో పదోన్నతి పొందిన పీఈఓలు 29 ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సర్వీస్ రూల్స్‌ను, రిజర్వేషన్ల ప్రక్రియను ఉల్లంఘిస్తూ సీనియారిటీని, సమర్థతను కాదని పీడీఓల పదోన్నతులకు సంబంధించి కౌన్సెలింగ్‌ను నిర్ణయించడంపై పంచాయతీరాజ్ వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇదే విధానం కొనసాగితే ప్రభుత్వ శాఖల్లో అనేక దుష్ట సంప్రదాయాలు వచ్చే అవకాశం ఉందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. అనారోగ్య సమస్యలు, స్పౌజ్ పరిస్థితుల్లో ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉండగా, కేవలం ఇంటి పన్ను వసూళ్ల ఆధారంగా కౌన్సెలింగ్‌ను చేపడితే ఉద్యోగులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. దీనిపై కొందరు పీడీఓలు జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా, ఫలితం లేకపోయింది. సాక్షాత్తు రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనరేట్ ఇచ్చిన జీఓ, సర్క్యూలర్ కాబట్టి తామేమి చేసేదే లేదని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఏడాది ప్రథమార్థంలో గ్రామ కార్యదర్శులకు పదోన్నతులు కల్పించినా, కేవలం సీనియారిటీని పరిగణనలోకి తీసుకుని కౌన్సెలింగ్ నిర్వహించిన సంగతిని పంచాయతీరాజ్ ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు.


