నిడదవోలు: ఓ గర్భిణికి ఆదివారం 108 అంబులెన్స్‌లో సుఖ ప్రసవం జరిగింది. ఆ వివరాల ప్రకారం.. నిడదవోలు మండలం కాటకోటేశ్వరం గ్రామానికి చెందిన సీహెచ్ శకుంతలకు పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. ఆ సిబ్బంది వెంటనే గ్రామానికి చేరుకుని గర్భిణి శకుంతలను అంబులెన్స్‌లో ఎక్కించుకుని నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వస్తుండగా పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో వాహనాన్ని మార్గం మధ్యలో నిలిపివేసి ఫైలెట్ ఎల్.నాగరాజు, ఈఎంటీ జి.శ్రీనివాస్, ఆశ కార్యకర్తలు శకుంతలకు డెలివరీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారు. 108 వాహన సిబ్బందిని స్థానికులు, కుటుంబ సభ్యులు అభినందించారు.
పడిపోతున్నట్లు నటించి..
నగదు దొంగిలించి
నిడదవోలు: ఉండ్రాజవరం మండలం వెలగదుర్రు గ్రామంలో ఆదివారం చోరీ జరిగింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. వెలగదుర్రు గ్రామానికి చెందిన వృద్ధుడు డి.అప్పారావుకు ఇంటి ఖర్చుల నిమిత్తం దూర ప్రాంతంలో ఉంటున్న తన కుమారుడు గ్రామంలోని స్నేహితునికి రూ. 5 వేలు ఫోన్ పే చేశారు. ఆ నగదును అప్పారావు తీసుకు ని గ్రామ సెంటర్‌లో కూర్చున్నాడు. డబ్బులు తీసుకోవడం గుర్తించిన ఇద్దరు వ్యక్తులు అక్కడకు బైక్‌పై వచ్చారు. కిందకు పడిపోతున్నట్లు నటించారు. అది చూసిన అప్పారావు బైక్ వద్దకు వచ్చి సహాయం చేయడానికి ప్రయత్నించాడు. క్షణాల్లో అతని జేబులో ఉన్న రూ. 5 వేలు తీసుకుని బైక్‌పై ఉడాయించారు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరా ఆధారంగా ఆ దొంగలు వేరే ప్రాంతానికి చెందిన వారని గుర్తించారు. మోర్త గ్రామంలో ఇటీవల ఆంధ్రాబ్యాంక్ ప్రాంతంలో ఇదే తరహాలో ఎం.రామకృష్ణకు చెందిన రూ. 10 వేలు లాక్కుని పరారయ్యారు. ఇటీవల గ్రామంలో రెండు చోట్ల కోకో గింజలు బస్తాలు చోరీ చేసి వ్యాన్‌లో తరలించడం, ఇప్పుడు డబ్బులు దొంగిలించటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతి
నిడదవోలు: నిడదవోలు – నవాబ్‌పాలెం రైల్వే స్టేషన్ల మధ్య ఆదివారం గుర్తుతెలియని (35) వ్యక్తి మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. అతను రైలు నుంచి జారి కిందపడటంతో మరణించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి ఎత్తు 5.5 అడుగులు ఉండగా, ఒంటిపై నాచురంగు షర్ట్ ఉంది. తాడేపల్లిగూడెం రైల్వే ఎస్సై పి.అప్పారావు సంఘటనా స్థలానికి చేకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 92475 85733, 80191 57528 నంబర్లకు సమాచారం ఇవ్వాలని రైల్వే పోలీసులు కొరారు.


