అంబాజీపేట: వడగాడ్పులకు ఆర్‌ఎంపీ వైద్యుడు ఆదివారం మృతి చెందారు. వాకలగరువు అగ్రహారం వీధికి చెందిన పేరాబత్తుల వెంకటరత్నం (44) ఆర్‌ఎంపీ వైద్యుడిగా జీవనం సాగిస్తున్నారు. స్థానికంగా ఉన్న వారికి వైద్యం చేసేందుకు వెళ్లిన వెంకటరత్నం మధ్యాహ్నం రెండు గంటలకు ఇంటికి వచ్చారు. అనంతరం ఎవరి నుంచో ఫోన్ రావడంతో మధ్యాహ్నం మూడు గంటలకు మోటార్ సైకిల్‌పై వెళ్లారు. తర్వాత ఏటిగట్టుపై మోటార్ సైకిల్‌తో పడి ఉన్న వెంకటరత్నంను స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దాంతో 108కు ఫోన్ చేయగా వారు సంఘటనా స్థలానికి చేరుకుని పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. అంబాజీపేట పోలీసులతో పాటు వైద్యాధికారులకు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించినట్లు స్థానికులు తెలిపారు.
ఇప్పనపాడులో..
కపిలేశ్వరపురం (మండపేట): ఇప్పనపాడులోని లింగరాజుపేటకు చెందిన తిరుశూల సత్యనారాయణ (50) వడగాడ్పులకు మృతి చెందారు. ద్వారపూడి స్వీట్ స్టాల్‌లో పని చేస్తున్న తన భార్య వీరకు భోజనం ఇచ్చి సైకిల్‌పై ఇంటికి తిరిగి వస్తూ ఇంటి సమీపంలో అతను వడదెబ్బకు గురై మృతి చెందారు.
ఆత్రేయపురం, కపిలేశ్వరపురం (మండపేట): వాడపల్లి వేంకటేశ్వర స్వామివారి ఆలయ అన్నదాన భవనంలో సేవ చేస్తూ వాడపల్లికి చెందిన సరిదే భాను (73) వడగాడ్పులకు మృతి చెందింది. మండపేట మండలం ఏడిద అంబేడ్కర్ నగర్‌కు చెందిన బూరిగ కన్నమ్మ (84) వడదెబ్బకు మృత్యువాత పడింది.


