● పెట్రోల్ 97 పైసలు..
● డీజిల్ 99 పైసలు పెంపు
సాక్షి, రాజమహేంద్రవరం: కేంద్ర ప్రభుత్వం మరోసారి ఇంధన ధరలలు పెంచింది. 13 రోజుల వ్యవధిలోనే ఇలా పెంచడం మూడో సారి. తాజాగా పెంచిన ధరలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. లీటరు పెట్రోల్‌పై 97 పైసలు, డీజిల్‌పై 99 పైసలు పెంచింది. ప్రస్తుతం పెట్రోలు లీటరు ధర రూ.113.86 ఉండగా శనివారం ఉదయం 6 గంటల నుంచి రూ.114.86కు పెరిగింది. డీజిల్ లీటరు రూ.100.55 ఉండగా రూ.102.55కు చేరింది.
రూ.9.66 లక్షల భారం
ఈ పెంపుతో ప్రజలపై రోజుకు రూ.9.66 లక్షల భారం పడనుంది. జిల్లా వ్యాప్తంగా 200 పెట్రోల్ బంకులు ఉన్నాయి. జిల్లాలో సగటున రోజుకు 4.77 లక్షల పెట్రోల్, 5.77 లక్షల డీజిల్ వినియోగిస్తారు. దీన్ని బట్టి పెట్రోల్‌పై రూ.4.55 లక్షలు, డీజిల్‌పై రూ.5.71 లక్షల భారం పడనుంది. మొత్తంగా రోజుకు సుమారు రూ.9.66 లక్షల అదనపు భారం ప్రజలపై పడనుంది. కంపెనీలను బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. ఈ వరుస ధరల పెంపుతో తాము తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని వినియోగదారులు ఆవేదన చెందుతున్నారు.


