ఓవర్‌ లోడ్‌తోనే విద్యుత్‌ సమస్య | - | Sakshi
Sakshi News home page

ఓవర్‌ లోడ్‌తోనే విద్యుత్‌ సమస్య

May 24 2026 12:39 AM | Updated on May 24 2026 12:39 AM

పైడిమెట్టలో మూడు 15కేవీ

ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు

‘కట్‌లపై కన్నెర్ర’కు స్పందించిన

అధికారులు

తాళ్లపూడి: విద్యుత్‌ కోతలపై ప్రజలు కన్నెర్ర చేయడంతో అధికారులు స్పందించారు. సహజంగానే వేసవిలో విద్యుత్‌ అధిక వినియోగం వల్ల డిమాండ్‌ సప్లైల మధ్య భారీ వ్యత్యాసంతో ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతుంటాయి. ఈ విషయాన్ని ముందుగానే గుర్తించి విద్యుత్‌ అధికారులు సత్వర చర్యలు తీసుకుని ఏ సమస్యా రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. శుక్రవారం రాత్రి కూడా వేగేశ్వరపురం, తాళ్లపూడి, ప్రక్కిలంకలో పలుమార్లు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. వేగేశ్వరపురంలో సబ్‌ రిజిస్టార్‌ వీధిలో రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు విద్యుత్‌ లేక ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఈ విషయమై సాక్షిలో ‘కట్‌లపై కన్నెర్ర’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీంతో అధికారులు రంగంలోకి దిగారు. ఓవర్‌లోడుతో పైడిమెట్ట, వేగేశ్వరపురం గ్రామాల్లో విద్యుత్‌ సమస్య ఏర్పడిందని ఏఈ శ్రీనివాస్‌ తెలిపారు. వేగేశ్వరపురంలో అదనపు ట్రాన్సఫార్మర్‌ వేయనున్నామని, పైడిమెట్టలో మూడు 15 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేసినట్టు ఏఈ తెలిపారు.

ఏలూరు రేంజి ఐజీ

వార్షిక తనిఖీలు

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు కార్యాలయంలో ఏలూరు రేంజి ఐజీ జీవీజీ అశోక్‌కుమార్‌ శనివారం వార్షిక తనిఖీ నిర్వహించారు. ఎస్పీ నరసింహ కిశోర్‌ ఆయనకు స్వాగతం పలికారు. కార్యాలయంలో వివిధ విభాగాల తీరు, రికార్డుల నిర్వహణను ఆయన పరిశీలించారు. ప్రజా భద్రత, క్రమశిక్షణ, సమర్థవంతమైన సేవలపై అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సిబ్బంది, కంప్యూటర్‌ పరిజ్ఞానం, స్మార్ట్‌ పోలీసింగ్‌ విధానాలపై పూర్తి అవగాహన కలిగి ఉండేలా శిక్షణ ఇవ్వాలని అధికారులకు సూచించారు. జిల్లా పోలీస్‌ కార్యాలయ ప్రాంగణంలో ఆయన మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన టీటీ కోర్టును ప్రారంభించారు. రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాల్లో భాగంగా రాజపాలేనికి చెందిన మురళీకృష్ణ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ విరాళంగా అందజేసిన 25 హెల్మెట్లను ఐజీ పంపిణీ చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్‌.చెంచిరెడ్డి, డీఎస్పీలు, సీఐలు, ఆర్‌ఐలు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

నగరపాలక సంస్థలో

‘క్లీన్‌ స్వీప్‌’

రాజమహేంద్రవరం సిటీ: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో శనివారం ‘ఆపరేషన్‌ క్లీన్‌ స్వీప్‌’ ప్రారంభించారు. జూన్‌ 20 వరకు నాలుగు వారాల పాటు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కలెక్టర్‌ కీర్తి చేకూరి తెలిపారు. నగరంలో మున్సిపల్‌ కార్యాలయం నుంచి ఆనం కళాకేంద్రం మీదుగా గోదావరి రైల్వే స్టేషన్‌ వరకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కమిషనర్‌ రాహుల్‌ మీనాతో కలిసి ఆమె నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్‌ పీవీ రామలింగేశ్వర్‌, డిప్యూటీ కమిషనర్‌ ఎస్‌.వెంకట రమణ, సెక్రటరీ జి.శైలజవల్లి, ఎస్‌ఈ రీటా, సిటీ ప్లానర్‌ జి.వి.ఎస్‌.ఎన్‌. మూర్తి, ఎంహెచ్‌ఓ వి . వినూత్న, మేనేజర్‌ అబ్దుల్‌ మలిక్‌, వివిధ కార్పొరేషన్‌ ల డైరెక్టర్లు, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement