వాడపల్లికి పోటెత్తిన భక్తులు
ఆత్రేయపురం: భానుడు ఉగ్రరూపం దాల్చినా.. భక్తిభావం సడలలేదు.. ఆ శ్రీనివాసుని దర్శనానికి భక్తజనం క్యూ కట్టింది. వాడపల్లిలోని వేంకటేశ్వరస్వామి దేవస్థానం శనివారం కిక్కిరిసింది. సుమారు 80 వేల నుంచి లక్ష వరకూ వచ్చినట్లు ఆలయ ఈఓ, దేవదాయ శాఖ ఉప కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. తెల్లవారుజాము నుంచే రద్దీ నెలకొంది. ఏడు శనివారాల నోము ఆచరిస్తున్న భక్తులు ఏడు ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. వేకువ జామునే సుప్రభాత సేవ, తొలి హారతి, నీరాజనం, ఐశ్వర్య లక్ష్మీహోమం, బాలభోగం వంటి కార్యక్రమాలను ఆలయ అర్చకులు, వేద పండితులు నిర్వహించారు. ఆలయ ఆవరణలో వేంచేసి ఉన్న క్షేత్రపాలకులు, అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామి వారిని భక్తులు దర్శించుకున్నారు. వేసవి తీవ్రతకు అనుగుణంగా భక్తులకు చల్లని మజ్జిగ, నీరు అందించడానికి చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే సత్యసాయి సేవా సంస్థలు సైతం చలివేంద్రాన్ని నిర్వహించారు. ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈఓ సూర్యచక్రధరరావు, ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.


