ముగిసిన త్యాగరాజ సమితి అమృతోత్సవం
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): శ్రీ త్యాగరాజ నారాయణ దాస సేవా సమితిలో పెరవలి జయభాస్కర్ బృందం లయ విన్యాసం ఆకట్టుకుంది. సమితి 75 వసంతాల సందర్భంగా స్థానిక గోదావరి గట్టున గల సమితి ప్రాంగణంలోని ఏసీ ఆడిటోరియంలో 18 రోజుల పాటు సాగిన కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది. చివరిరోజు శనివారం సాయంత్రం పెరవలి జయభాస్కర్ బృందంచే లయ విన్యాసం పేరిట వాద్య సమ్మేళనం హృద్యంగా సాగింది. కళాకారులు, కార్యవర్గంతో కలిసి మహా మహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి జ్యోతి ప్రకాశనం చేశారు. పెరవలి జయభాస్కర్ మృదంగం, రాజశేఖర్ వయోలిన్, కె. నందకుమార్ సితార, సరస్వతుల హనుమంతరావు ఘటం, లింగంగుంటి ప్రసాద్ మోర్సింగ్, వీఎస్ కళాధర్ కంజీరా, కోడూరు ప్రకాష్ కీబోర్డ్‌పై కార్యక్రమాన్ని రక్తి కట్టించారు. విశ్వనాథం భాస్కర రామ్, వాడ్రేవు వెంకట రమణారావు, సీఎస్ వెంకట్రావు, జోస్యుల సరస్వతి, వక్కలంక శ్రీరామచంద్రం, వి.కృష్ణకుమారి తదితర సమితి కార్యవర్గం పర్యవేక్షించింది.


