● గ్రంథాలయాలపై సర్కారు నిర్లక్ష్యం
● పేరుకుపోయిన రూ.50 కోట్ల బకాయిలు
● రెండు నెలలుగా ఉద్యోగులకు జీతాల్లేవు
● పింఛన్ దారులదీ అదే పరిస్థితి
ఆలమూరు: విజ్ఞాన బాండాగారాలుగా ప్రఖ్యాతి గాంచిన గ్రంథాలయాలు కూటమి పాలనలో అధ్వానంగా మారుతున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల నుంచి వసూలు కావాల్సిన గ్రంథాలయ పన్ను సుమారు రూ.50 కోట్ల వరకూ బకాయి ఉండటంతో వెలవెలబోతూ నీరసించి పోతున్నాయి. రెండు నెలల నుంచి గ్రంథాలయాల ఉద్యోగులకు, మూడు నెలల నుంచి పింఛన్ దారులకు వేతనాలు మంజూరు జరగలేదు. ఈ నెల ముగిసి జూన్ వస్తే 4 నెలల జీతాలు బకాయి రూ.4.5 కోట్లు వరకూ ఉంటుంది.
అప్పులతో జీవనం
పింఛన్‌దారులైతే తమ అనారోగ్య పరిస్థితుల నుంచి బయట పడేందుకు అప్పులు తెచ్చి మరీ మందులు, ఇతర నిత్యావసరాలను కొనుగోలు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీనే సామాజిక పింఛన్లను అందిస్తున్న విధంగానే తమకు ఎందుకు ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తోందని పింఛన్ దారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలో గ్రంథాలయ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం కలగలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
వైఎస్సార్ సీపీ హయాంలో అభివృద్ధి
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో ప్రజలకు విజ్ఞానాన్ని అందించే గ్రంథాలయాలు నిర్వీర్యమవుతున్నాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో గ్రంథాలయాల అభివృద్ధికి రూ.130 కోట్లు కేటాయిస్తే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో కేవలం రూ.42 కోట్లు కేటాయించడం పరిస్థితికి అద్దం పడుతుంది. అలాగే అప్పటి సీఎం వైఎస్ జగన్ పరిపాలన సాగించిన ఐదేళ్ల కాలంలో క్రమం తప్పకుండా వేతనాలు అందించారు. ఇప్పుడు చంద్రబాబు పాలనలో మూడు నెలలు పూర్తయ్యి నాలుగో నెల వస్తున్నా జీతాల మంజూరుపై స్పష్టత లేకుండా పోయింది. గ్రంథాలయాలకు పునరుజ్జీవం రావాలంటూ ప్రజల నుంచి వసూలు చేసిన పన్నును సత్వరమే గ్రంథాలయ శాఖకు జమ చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.
ప్రజలు చెల్లిస్తున్నా..
కార్పొరేషన్, మున్సిపాలిటీలు, నగర, గ్రామ పంచాయతీలలో నివసించే ప్రజలు ప్రతి ఏటా క్రమం తప్పకుండా 08 శాతం మేర గ్రంథాలయ పన్ను చెల్లిస్తున్నా జిల్లా కేంద్ర గ్రంథాలయ శాఖకు జమ కావడం లేదు. దీనివల్ల ఉద్యోగులు, పింఛన్‌దారులకు జీతాలు ఇవ్వకపోవడంతో కొత్త పుస్తకాల కొనుగోళ్లు, గ్రంథాలయాల అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయింది. గ్రంథాలయాల్లో సిబ్బంది కొరత వేధిస్తుండటంతో గ్రంథ పాలకుల సేవలు సక్రమంగా అందడం లేదు. కొత్త పుస్తకాల కొనుగోలు లేకపోవడంతో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థుల భవితవ్యం అగమ్యగోచరంగా మారింది.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా
గ్రంథాలయాలు 102
ప్రస్తుతం పనిచేస్తున్నవి 100
గ్రామీణ గ్రంథాలయాలు 04
పుస్తక నిక్షిప్త కేంద్రాలు 161
గ్రంథాలయాల్లో ఉద్యోగులు 294
ప్రస్తుతం ఉన్న ఉద్యోగులు 57
ఉద్యోగుల ఖాళీలు 237
పింఛన్‌దారులు 167


