● 48 గంటలుగా నిలిచిన విద్యుత్ సరఫరా
● మండిపడిన పైడిమెట్ట గ్రామస్తులు
● ప్రక్కిలంక సబ్ స్టేషన్ ముట్టడి
తాళ్లపూడి: అసలే ఓవైపు 45 డిగ్రీల సెల్సియస్‌కు పైబడిన ఉష్ణోగ్రతలు, తీవ్ర వడగాడ్పులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. తీవ్రమైన ఉక్కపోతతో ఆపసోపాలు పడుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో ఏపీ ఈపీడీసీఎల్ అధికారులు అప్రకటిత విద్యుత్ కోతలు విధిస్తూండటంతో మండల ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడిన చందంగా మారింది. ముఖ్యంగా చంటి పిల్లలు, వృద్ధులు, అనారోగ్య పీడితులు నానా అగచాట్లూ పడుతున్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా విద్యుత్ సరఫరాను నిలిపివేస్తూండటంతో నరకం చవి చూస్తున్న ప్రజలు కన్నెర్ర చేస్తున్నారు. గురువారం పలుమార్లు అధికారులు కరెంట్ కట్ చేశారు. రాత్రి 10 నుంచి 12 గంటల వరకూ సరఫరాను నిలిపివేశారు. తిరిగి శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ విద్యుత్ కోత విధించారు. పైడిమెట్ట గ్రామం పరిస్థితి మరింత దారుణంగా మారింది. గత 48 గంటలుగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆ గ్రామమంతా అంధకారంలో మునిగిపోయింది. ఈపీడీసీఎల్ అధికారుల తీరుపై ఆగ్రహించిన పైడిమెట్ట గ్రామస్తులు గురువారం అర్ధరాత్రి ప్రక్కిలంక విద్యుత్ సబ్ స్టేషన్‌ను ముట్టడించారు. కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, ఇదేం పద్ధతని సిబ్బందిని నిలదీశారు. లోడ్ ఎక్కువ కావడంతో సరఫరాలో సమస్య తలెత్తుతోందని అధికారులు చెప్పారు. రెండు రోజులుగా గ్రామం చీకట్లో మగ్గుతున్నా, సమస్యను పరిష్కరించడంలో అధికారులు, స్థానిక నాయకులు చొరవ చూపడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి, పైడిమెట్ట గ్రామానికి తక్షణమే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని, అవసరమైన ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాలని, మండలంలో అప్రకటిత విద్యుత్ కోతలను అరికట్టాలని డిమాండ్ చేశారు.


