వడదెబ్బకు 14 మంది మృతి | - | Sakshi
Sakshi News home page

వడదెబ్బకు 14 మంది మృతి

May 23 2026 12:28 AM | Updated on May 23 2026 12:28 AM

పిఠాపురం రూరల్‌/కాకినాడ రూరల్‌/సీతానగరం/నిడదవోలు రూరల్‌/ఆత్రేయపురం: తీవ్రమైన ఎండలు, వడగాడ్పులకు తాళలేక ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రెండు రోజుల వ్యవధిలో 14 మంది మృతి చెందారు. పిఠాపురం నియోజకవర్గంలో ఒకే రోజు ఏకంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. గొల్లప్రోలు మండలం చెందుర్తికి చెందిన పిల్లి రమణ (55) ఉపాధి పని చేస్తూ అస్వస్థతకు గురయ్యాడు. కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిఠాపురం సినిమా సెంటర్‌లో కొల్లు అప్పారావు, అన్న క్యాంటీన్‌ వద్ద ఓ యాచకుడు, పాదగయ క్షేత్రం వద్ద లారీ డ్రైవర్‌, మండలంలోని గోకివాడలో దూలపల్లి అప్పారావు (43), ఎఫ్‌కే పాలెం మద్యం దుకాణంలో పని చేస్తున్న కొమ్ము వెంకట రమణ (44) వడదెబ్బతో మృతి చెందినట్టు ఎస్సై ఎస్‌కే జానీబాషా తెలిపారు.

కాకినాడ రూరల్‌ భావనారాయణపురానికి చెందిన గుర్రం అప్పన్న (38) సర్పవరం గ్రామ పంచాయతీలో కాంట్రాక్టు పారిశుధ్య కార్మికుడు. విధి నిర్వహణలో వడద్బెకు గురైన అతడు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్లలో వైఎస్సార్‌ సీపీ గ్రామ యువజన నాయకుడు గారపాటి ధర్మతేజ (24) ఎండవేడిమితో డీహైడ్రేషన్‌కు గురై శుక్రవారం మృతి చెందారు. సీతానగరం మండలం చినకొండేపూడిలో పెడూరి చిట్టిబాబు (33), వెలమపేటలో 58 ఏళ్ల వ్యక్తి గురువారం రాత్రి మరణించారు. పురుషోత్తపట్నం పంచాయతీ రామచంద్రపురంలో కండవల్లి మంగమ్మ (88) శుక్రవారం మృతి చెందారు.

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వెలిచేరులో కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్న నాగిరెడ్డి రాముడు (60), నాగిరెడ్డి పనస రాముడు (75) వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయారు. అలాగే, ఉచ్చిలి గ్రామానికి చెందిన మాగాపు శ్రీను (45) వడగాలుల ప్రభావంతో గుండెపోటుకు గురై మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement