ఐటీఐ కోర్స్‌... ఉపాధికి సోర్స్‌ | - | Sakshi
Sakshi News home page

ఐటీఐ కోర్స్‌... ఉపాధికి సోర్స్‌

May 22 2026 12:12 AM | Updated on May 22 2026 12:12 AM

ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఈ నెల 30వ తేదీ తుది గడువు

జిల్లాలో 1,210 సీట్లు

రాజమహేంద్రవరం రూరల్‌: పదో తరగతి పూర్తి కాగానే విద్యార్థులు ఏ కోర్సులో చేరాలా అని ఆలోచిస్తారు. అధిక శాతం మంది ఇంటర్మీడియెట్‌లో చేరుతారు. పలువురు పాలిటెక్నిక్‌, ఐటీఐ కోర్సులకు ప్రాధాన్యమిస్తారు. సాంకేతిక కోర్సుల్లో ఇంటర్‌ ఒకేషనల్‌, పాలిటెక్నిక్‌ కోర్సులతో పాటు పలువురు విద్యార్థులు ఇండస్ట్రియల్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌కు (ఐటీఐ) ప్రాధాన్యమిస్తున్నారు. ఐటీఐ కోర్సుల్లో చేరేందుకు పదో తరగతి పాసై, ఇంటర్మీడియెట్‌ ఫెయిలైన అభ్యర్థులు ఈ నెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.

త్వరగా ఉద్యోగావకాశాలు

యువతకు స్వయం ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యంగా సాంకేతిక విద్యా శాఖ ఆధ్వర్యాన ఐటీఐ శిక్షణ కొనసాగుతోంది. పదో తరగతి పూర్తి కాగానే అతి తక్కువ కాలంలో స్థిరపడాలనుకునే వారికి ఐటీఐ చక్కని వేదికగా నిలుస్తోంది. ఐటీఐ పూర్తి చేసిన తర్వాత విద్యార్థులు అప్రెంటిస్‌ పూర్తి చేసుకుంటే 18 ఏళ్లు దాటగానే వివిధ పరిశ్రమల్లో ఉద్యోగాలు పొందడానికి అవకాశం ఉంటుంది. విద్యుత్‌, రైల్వే, రక్షణ, పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అయితే, నైపుణ్యం తప్పనిసరి. ఆయా ట్రేడుల్లో నైపుణ్యం సంపాదించిన విద్యార్థులకు ఉపాధి తప్పనిసరిగా లభిస్తుంది. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి శిక్షణ సంస్థ ఐటీఐల్లో స్కిల్‌ హబ్‌లు ఏర్పాటు చేసి, విద్యార్థులకు శిక్షణ ఇస్తోంది.

ఏడాది, రెండేళ్ల వ్యవధి కోర్సులు

ఐటీఐల్లో ఏడాది, రెండేళ్ల కాలపరిమితితో రెగ్యులర్‌ కోర్సులు ఉంటాయి. రెండేళ్ల కాలపరిమితితో ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్‌, ఎలక్ట్రానిక్‌, మెకానికల్‌, డ్రాఫ్ట్స్‌మన్‌ సివిల్‌ వంటి కోర్సులుంటాయి. ఏడాది కాలపరిమితిలో డీజిల్‌ మెకానిక్‌, వెల్డర్‌, కోపా, హార్టికల్చర్‌ కోర్సులుంటాయి. విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న కోర్సులు ఏయే ఐటీఐల్లో ఉన్నాయో పరిశీలించుకోవాలి. దరఖాస్తుల పరిశీలన పూర్తయిన విద్యార్థులు మాత్రమే కౌన్సెలింగ్‌కు అర్హత సాధిస్తారు. అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే తరగతుల ప్రవేశానికి షెడ్యూల్‌ విడుదల చేస్తారు.

ఉన్నత చదువులకు అవకాశం

ధవళేశ్వరంలోని ప్రభుత్వ ఐటీఐతో పాటు జిల్లాలో 13 ప్రైవేటు ఐటీఐలున్నాయి. వీటిలో ఏడాది, రెండేళ్ల కాలపరిమితితో 1,210 సీట్లు అందుబాటులో ఉన్నాయి. రెండేళ్ల వ్యవధి కోర్సులు పూర్తి చేసిన వారికి ఉన్నత చదువులకు అవకాశం ఉంటుంది. ఐటీఐ పూర్తి చేసిన వారు పాలిటెక్నిక్‌ రెండో సంవత్సరంలో బ్రిడ్జి కోర్సు ద్వారా ప్రవేశం పొందవచ్చు. పాలిటెక్నిక్‌ పూర్తి చేసిన వారు బీటెక్‌లో ప్రవేశం పొందవచ్చు. ఈవిధంగా ఏటా పలువురు లేటరల్‌ ఎంట్రీ పొంది, ఉన్నత విద్య అభ్యసించి, ఉద్యోగావకాశాలు పొందుతున్నారు.

మెరుగైన అవకాశాలు

ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులకు గతంతో పోలిస్తే మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఐటీఐల్లో చేరగోరే విద్యార్థులు ఈ నెల 30వ తేదీలోగా హెచ్‌టీటీపీఎస్‌://ఐటీఐఏడీఎంఐఎస్‌ఎస్‌ఐఓఎన్‌ఎస్‌.ఏపీ.జీఓవీ.ఐఎన్‌/ఐటీఐ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల పరిశీలన కోసం ధవళేశ్వరం ప్రభుత్వ ఐటీఐకి విఽధిగా హాజరు కావాలి. కౌన్సెలింగ్‌ షెడ్యూలు వివరాలను విద్యార్థుల మొబైల్‌ నంబర్‌కు పంపిస్తాం. పదో తరగతిలో విద్యార్థి పొందిన మార్కులు, రిజర్వేషన్‌ రోస్టర్‌ ప్రకారం అడ్మిషన్లు ఉంటాయి.

– సీహెచ్‌ సునీల్‌ కుమార్‌, జిల్లా ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల

కన్వీనర్‌, ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్‌, రాజమహేంద్రవరం

Advertisement
 
Advertisement
Advertisement