అధిక ఉష్ణోగ్రతలపై అప్రమత్తత | - | Sakshi
Sakshi News home page

అధిక ఉష్ణోగ్రతలపై అప్రమత్తత

May 22 2026 12:12 AM | Updated on May 22 2026 12:12 AM

89779 35611 నంబరుతో

కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూము

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పుల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని కలెక్టర్‌ కీర్తి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించేందుకు కలెక్టరేట్‌లో 89779 35611 నంబరుతో కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోలు రూము ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అవసరమైన వారు వెంటనే ఈ నంబరును సంప్రదించాలని సూచించారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ, భారత వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ఈ నెల 24వ తేదీ వరకూ కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉండే అవకాశముందన్నారు. ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, బహిరంగ ప్రదేశాల్లో పని చేసే కార్మికులు, రోజువారీ కూలీలు రానున్న మూడు రోజులూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లా స్థాయిలో పరిస్థితులను పర్యవేక్షించేందుకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారిని నోడల్‌ అధికారిగా నియమించామని కలెక్టర్‌ తెలిపారు.

ఇంటర్‌ సప్లిమెంటరీ

పరీక్షలు ప్రారంభం

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లావ్యాప్తంగా 38 కేంద్రాల్లో ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. ఉదయం ఫస్టియర్‌, మధ్యాహ్నం సెకండియర్‌ తెలుగు, హిందీ, సంస్కృతం, ఒకేషనల్‌ కోర్సుల్లో పరీక్షలు జరిగాయి. ప్రథమ సంవత్సరం జనరల్‌ విభాగంలో 2,430 మందికి 2,229 మంది పరీక్షలు రాయగా 201 మంది గైర్హాజరయ్యారు. వృత్తి విద్యా కోర్సుల్లో 291 మందికి 264 మంది హాజరు కాగా, 27 మంది పరీక్షలు రాయలేదు. ద్వితీయ సంవత్సరంలో జనరల్‌ విభాగంలో 1,239 మందికి 1,038 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 201 మంది పరీక్షలు రాయలేకపోయారు. వృత్తి విద్యా కోర్సుల్లో 209 మందికి 191 మంది పరీక్షలు రాయగా, 18 మంది గైర్హాజరయ్యారు. ఇంటర్మీడియెట్‌ బోర్డు ప్రాంతీయ అధికారి ఐ.శారద బృందం, సిట్టింగ్‌, ఫ్లయింగ్‌ స్వాడ్స్‌ బృందాలు 19 కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించాయి.

వైఎస్సార్‌ సీపీ అనుబంధ విభాగాల్లో నియామకాలు

సాక్షి, రాజమహేంద్రవరం: వైఎస్సార్‌ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర, జిల్లా అనుబంధ విభాగాల్లో ఇద్దరిని వివిధ హోదాల్లో నియమించారు. మహిళా విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధిగా రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గానికి చెందిన రుకియా సయ్యద్‌ నియమితులయ్యారు. అనపర్తి నియోజకవర్గానికి చెందిన సుందరంపల్లి సుధాకర్‌బాబును జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఉత్తర్వులు విడుదల చేసింది.

15 రోజులు..

రూ.2.06 కోట్లు

చినవెంకన్నకు దండిగా హుండీల ఆదాయం

ద్వారకా తిరుమల: హుండీల ద్వారా ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి దండిగా ఆదాయం సమకూరింది. గడచిన 15 రోజులకు నగదు రూపేణా రూ.2,06,21,794 ఆదాయం లభించిందని ఆలయ ఈఓ వి.త్రినాథరావు తెలిపారు. అలాగే, భక్తుల కానుకల రూపేణా 281 గ్రాముల బంగారం, 2.887 కేజీల వెండి, అధికంగా విదేశీ కరెన్సీ లభించాయని వివరించారు. దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌, మద్ది ఆంజనేయ స్వామి ఆలయ ఈఓ ఆర్‌వీ చందన, పోలీసుల పర్యవేక్షణలో స్థానిక ప్రమోద కల్యాణ మండపంలో శ్రీవారి ఆలయ హుండీల నగదు లెక్కింపును గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.2 వేలు, రద్దయిన పాత రూ.1,000, రూ.500 నోట్ల ద్వారా లెక్కింపు లోకి రాని ఆదాయం రూ.31 వేలు వచ్చిందని ఈఓ తెలిపారు. సగటున రోజుకు చిన వెంకన్నకు రూ.13,74,786 ఆదాయం సమకూరిందని ఈఓ చెప్పారు.

పొల్లూరు జలపాతంలో

పడి యువకుడి మృతి

మోతుగూడెం: పొల్లూరు జలపాతంలో మునిగి ఓ యువకుడు మృతి చెందాడు. ఎస్సై నాజీర్‌ కథనం ప్రకారం.. తెలంగాణలోని భద్రాచలానికి చెందిన ఎం.మోజెస్‌ (21) రాజమహేంద్రవరం గైట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో చదువుతున్నాడు. అతడు, మరో నలుగురు స్నేహితులు కలసి గురువారం పొల్లూరు జలపాతానికి విహార యాత్రకు వచ్చారు. అందరూ స్నానం చేస్తుండగా, మోజెస్‌ నీటిలో మునిగిపోయాడు. వెంటనే అతడిని బయటకు తీసి, సీపీఆర్‌ చేసినా ఫలితం లేకపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement